విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై నాని సంచలన ఆరోపణలు.. సీఎం రేవంత్‌కు ఫిర్యాదు
- హైదరాబాద్‌లో వేల కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నమంటూ ఆరోపణ
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన కేశినేని నాని
- భూకబ్జాను అడ్డుకుని, చిన్నిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్
- ఈడీ, ఎన్సీఎల్టీ ఆదేశాలను దాచిపెట్టి మోసానికి పాల్పడుతున్నారని ఆరోపణ
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగర శివారులోని ప్రగతి నగర్, షంషిగూడ ప్రాంతంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు (టీజీఐఐసీ) చెందిన 112.72 ఎకరాల భూమి ఉంది. దీనిని ఐటీ పార్క్ కోసం కేటాయించారు. అయితే, ఈ అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ఎంపీ కేశినేని చిన్ని, ఆయన బినామీగా వ్యవహరిస్తున్న మెసర్స్ ఎక్సెల్లా ప్రాపర్టీస్ అనే సంస్థ అక్రమంగా చేజిక్కించుకోవాలని చూస్తున్నాయని కేశినేని నాని తన లేఖలో ఆరోపించారు. ఈ భూమిపై ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు ఆదేశాలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆంక్షలు అమల్లో ఉన్నాయని, ఈ కీలక విషయాలను దాచిపెట్టి మోసానికి పాల్పడుతున్నారని నాని పేర్కొన్నారు.
ఈ వాస్తవాలను మరుగునపరిచి, సుప్రీంకోర్టులో ఒక మోసపూరిత రాజీ ఒప్పందాన్ని చూపి ప్రభుత్వ భూమిని కొట్టేయాలని కుట్ర చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. గతంలో జిల్లా కలెక్టర్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఈ భూమిపై ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి హక్కులు లేవని (జీరో ప్రైవేట్ టైటిల్) స్పష్టంగా ఉన్నప్పటికీ, అక్రమార్కులు రాత్రికి రాత్రే ఆక్రమణలు మొదలుపెట్టారని నాని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కేశినేని నాని కోరారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు అడ్వకేట్ జనరల్ ద్వారా న్యాయస్థానాల్లో జోక్యం చేసుకుని, ఈ అక్రమ భూ బదలాయింపును నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు కోసం ఏర్పాటు చేసిన 'హైడ్రా' యంత్రాంగాన్ని వెంటనే రంగంలోకి దించి, ఇప్పటికే మొదలైన అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. నకిలీ పత్రాలు, మోసపూరిత ఒప్పందాలతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఎంపీ కేశినేని చిన్ని, ఆయన బినామీలు, సూత్రధారులపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆరోపణలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.