ప్రతి ఒక్కరూ కాలర్ ఎగరేసి చెప్పుకునేలా అమరావతి ఉంటుంది: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu says Amaravati construction will make everyone proud
  •  కిష్టంశెట్టిపల్లెలో 'సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్'ను ప్రారంభించిన చంద్రబాబు
  • ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలుకు నిర్ణయం
  • ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ రికార్డులతో సమగ్ర ఆరోగ్య పర్యవేక్షణ
  • కాలర్ ఎగరేసేలా అమరావతి నిర్మాణం ఉంటుందని స్పష్టీకరణ
  • వైసీపీ మూడు ముక్కల ఆట ఆడి రాష్ట్రాన్ని దెబ్బతీసిందని విమర్శ
మార్కాపురం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం కిష్టంశెట్టిపల్లెలో 'సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్'ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి నిర్మాణంపై సీఎం స్పష్టత ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కాలర్ ఎగరేసి చెప్పుకునేలా అమరావతిని ప్రపంచ స్థాయి హరిత నగరంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 

గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. "గొడ్డలి పార్టీ ముందు అమరావతిని అంగీకరించి, ఆ తర్వాత మూడు ముక్కల ఆట ఆడింది. ఐదేళ్ల పాటు అభివృద్ధిని ఆమడ దూరం పెట్టింది" అని అన్నారు. అమరావతిపై చట్టం అయిపోయాక కూడా 'మావిగన్' అంటూ పట్టుకుని వేలాడుతున్నారని, ప్రజలు ఛీ కొడుతున్నా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైసీపీ క్రిమినల్ రాజకీయాలతో సమాజానికి, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపైనా సీఎం మాట్లాడారు. అన్నదాత పథకం కింద మొదటి విడత నిధులు విడుదల చేశామని, వచ్చే నెలలో 'తల్లికి వందనం' నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. వ్యవసాయంలో విచ్చలవిడి ఎరువుల వాడకాన్ని తగ్గించి, ప్రకృతి సేద్యం ద్వారా నాణ్యమైన ఉత్పత్తులు సాధించాలని రైతులకు పిలుపునిచ్చారు. జనాభా నిర్వహణ తక్షణ అవసరమని, ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని ఓ ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు.

ప్రస్తుత యువతరం జెన్ జీ, జెన్ ఆల్ఫా వర్గాల్లాగే ఆలోచనల విషయంలో తాను కూడా జెన్ జీనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్తును ముందుగానే ఊహించి, దానికి అనుగుణంగా టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నానని తెలిపారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీ వంటి ఆధునిక రంగాల్లో మన యువత నిష్ణాతులు కావాలని ఆయన ఆకాంక్షించారు. 

ఈ సాంకేతిక దార్శనికతకు ప్రతిరూపంగానే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం 'సంజీవని' ప్రాజెక్టును తీసుకొస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరెటివ్ విధానం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడతామని భరోసా ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వరకు మొత్తం ఆరోగ్య వ్యవస్థను ఒకే డిజిటల్ వేదికపైకి తెస్తామన్నారు. సంజీవని కార్డు ద్వారా డాక్టర్ అపాయింట్‌మెంట్, వర్చువల్ వైద్య సేవలు, ఆరోగ్య పర్యవేక్షణ సులభతరం అవుతాయని వివరించారు. ప్రజలు కూడా మంచి ఆహారపు అలవాట్లు, యోగా, వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.




Chandrababu Naidu
Amaravati Capital City
Sanjeevani Digital Health Project
Andhra Pradesh Welfare Schemes
Thalliki Vandanam
Digital Health Records

More Telugu News