25 పార్లమెంట్ కమిటీలతో కాసేపట్లో పవన్ కల్యాణ్ కీలక భేటీ.. పార్టీ బలోపేతమే లక్ష్యం
- మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్‌లో కీలక సమావేశం
- కమిటీల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశం కానున్న పవన్
- స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
గత ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో హిస్టారికల్ విక్టరీ కొట్టిన జనసేన... పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. కేవలం అధికారంలో భాగమవడమే కాకుండా... పార్టీని క్షేత్ర స్థాయి నుండి ఒక పవర్‌ఫుల్ కేడర్‌గా మార్చే ఆపరేషన్‌ను జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టారు. జనసేన సంస్థాగత బలోపేతంపై అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సమావేశాన్ని నేడు పవన్ నిర్వహించబోతున్నారు. కాసేపట్లో ఈ కీలక భేటీ ప్రారంభం కాబోతోంది.
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది. పార్టీ సమాచార సేకరణ కమిటీలతో పాటు 25 పార్లమెంట్ కమిటీల ప్రతినిధులతో పవన్ విడివిడిగా, ముఖాముఖిగా సమావేశమై లోతుగా చర్చలు జరపనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కమిటీల పనితీరు ఎలా ఉంది? గ్రౌండ్ లెవెల్‌లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అనే విషయాలపై పవన్ నేరుగా సమీక్ష జరపనున్నారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన లోకల్ ఈక్వేషన్స్, కూటమిలోని టీడీపీ-బీజేపీ నేతలతో క్షేత్రస్థాయి కార్యకర్తల సమన్వయం ఎలా ఉందనే విషయాలపై జనసేనాని ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో జనసేనను బలోపేతం చేసే వ్యూహాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.