రాజస్థాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం: శతాబ్దాల సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.. 13 ఏళ్ల బాలికకు ‘రాజపగ్గాల’ బాధ్యత!

Tejaswi Kumari Jodha takes royal responsibility breaking centuries old tradition in Rajasthan
  • పాలి జిల్లాలో శతాబ్దాల కాలం నాటి పురుషాధిక్య రాజ్‌పుత్ సంప్రదాయం బద్దలు
  • ‘పాగ్ కా దస్తూర్’ ద్వారా ఖేర్వాగఢ్ వంశ వారసురాలిగా 13 ఏళ్ల తేజస్వి కుమారి జోధా
  • ఇటీవల మరణించిన తండ్రి వారసత్వాన్ని స్వీకరించిన ఏడో తరగతి బాలిక
  • గులాబీ తలపాగా, నుదుటిపై రక్త తిలకంతో వేడుక నిర్వహణ
  • మగ వారసుడు లేక 65 ఏళ్లుగా నిలిచిపోయిన చారిత్రాత్మక క్రతువు
శతాబ్దాల కాలంగా వస్తున్న కట్టుబాట్లను, పురుషాధిక్య రాజకుటుంబ సంప్రదాయాలను పక్కన పెడుతూ రాజస్థాన్ చరిత్రలో ఒక అద్భుతమైన సామాజిక మార్పు చోటుచేసుకుంది. రాజ్‌పుత్ సంప్రదాయాల ప్రకారం కేవలం మగవారికే పరిమితమైన చారిత్రాత్మక ‘పాగ్ కా దస్తూర్’ (తలపాగా చుట్టే వేడుక)ను 13 ఏళ్ల బాలికకు నిర్వహించారు. పాలి జిల్లాలోని ఖేర్వాగఢ్ వంశానికి మొదటి మహిళా వారసురాలిగా తేజస్వి కుమారి జోధా అధికారికంగా బాధ్యతలు స్వీకరించి సరికొత్త రికార్డు సృష్టించింది.

గురువారం పాలి జిల్లాలోని చారిత్రాత్మక ఖేర్వా కోటలో వందల మంది గ్రామస్థులు, సంఘ పెద్దల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఇటీవల తేజస్వి కుమారి తండ్రి హరీశ్ చంద్ర జోధా అకాల మరణం చెందారు. ఆ వంశంలో మగ వారసులు ఎవరూ లేకపోవడంతో గత 65 ఏళ్లుగా ఈ కోటలో ‘పాగ్ కా దస్తూర్’ వేడుక జరగలేదు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా, లింగ సమానత్వాన్ని గౌరవిస్తూ తేజస్వి కుమారిని వారసురాలిగా ప్రకటించాలని కమ్యూనిటీ పెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయించారు.

ఈ సంప్రదాయ క్రతువులో భాగంగా జోధ్‌పూర్-మార్వార్ పూర్వ రాజకుటుంబం నుండి ప్రత్యేకంగా పంపిన గులాబీ రంగు తలపాగాను వేద మంత్రోచ్ఛారణల మధ్య తేజస్వి తలపై చుట్టారు. రాజ్‌పుత్ ఆచారం ప్రకారం ఆమె నుదుటిపై రక్తంతో తిలకం దిద్దారు. ఒక రాజకుటుంబం లేదా వంశ పెద్ద మరణించినప్పుడు, ఆ బాధ్యతలను తదుపరి తరం వారసుడికి అప్పగించడానికి ఈ 'పాగ్ కా దస్తూర్' వేడుకను నిర్వహిస్తారు. ఎంతో గంభీరంగా సాగిన ఈ వేడుకలో 13 ఏళ్ల తేజస్వి ఎంతో పరిణతితో, హుందాగా కూర్చుని అందరినీ ఆకట్టుకుంది.

ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్న తేజస్వి కుమారి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన చదువును కొనసాగిస్తూనే, వంశ వారసత్వంగా వచ్చిన ఈ కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పింది. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని స్పష్టం చేసింది. రాజస్థాన్ లాంటి సంప్రదాయాలు దట్టంగా ఉన్న ప్రాంతంలో, ఒక బాలికకు ఇటువంటి అరుదైన గౌరవం దక్కడం సామాజిక ఆధునికతకు, మహిళా సాధికారతకు ఒక గొప్ప మైలురాయి అని స్థానికులు కొనియాడారు.
Tejaswi Kumari Jodha
Pag Ka Dastur ceremony
Rajasthan Kherwa Fort Pali
First female Rajput heir
Kherwagarh royal succession
Women empowerment Rajasthan royalty

More Telugu News