ఒకసారి మోసపోయా, మళ్లీ కాదు: గ్రెగ్ చాపెల్‌తో నాటి వివాదంపై గంగూలీ వ్యాఖ్యలు
- గ్రెగ్ చాపెల్‌తో విభేదాలపై మళ్లీ స్పందించిన సౌరవ్ గంగూలీ
- వివాదం తర్వాత చాపెల్ రెండుసార్లు తనను సంప్రదించాడని వెల్లడి
- ఒకసారి మోసపోయాను, రెండోసారి కాదని స్పష్టం చేసిన దాదా
- కేకేఆర్ కోచ్‌గా వస్తానని చాపెల్ కోరినా పట్టించుకోలేదని వ్యాఖ్య
ఇటీవల ఓ స్పోర్ట్స్ జర్నలిస్టుతో నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో గంగూలీ మాట్లాడుతూ, ఈ ఏడాది ఆరంభంలో, జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా ఒక పిటిషన్‌పై సంతకం చేయాలని చాపెల్ తనను కోరాడని, అయితే తాను దానికి స్పందించలేదని చెప్పాడు. అలాగే 2011లో తాను ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్‌గా ఉన్న సమయంలో, ఆ జట్టుకు తాను కోచ్‌గా వస్తానని చాపెల్ ఈమెయిల్ పంపాడని గంగూలీ గుర్తుచేసుకున్నారు. ఆ ప్రతిపాదన చూసి ఆశ్చర్యపోయానని, కానీ దానిని ఏమాత్రం పట్టించుకోలేదని స్పష్టం చేశారు.
భారత క్రికెట్ చరిత్రలో గంగూలీ-చాపెల్ వివాదం ఒక వివాదాస్పద ఘట్టం. 2005లో గంగూలీ సిఫార్సుతోనే చాపెల్ భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. అయితే కొద్ది కాలంలోనే వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గంగూలీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని చాపెల్ బీసీసీఐకి లేఖ రాసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత గంగూలీ జట్టులో స్థానం కోల్పోయినప్పటికీ అద్భుతంగా పునరాగమనం చేశాడు. 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత్ జట్టు వైఫల్యం తర్వాత చాపెల్ తన పదవి నుంచి తప్పుకున్నాడు.