మంత్రి లోకేశ్ తో సమావేశం... ఆసక్తికరమైన అంశాలను వెల్లడించిన టీచర్లు
- సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లిన ఉపాధ్యాయులతో మంత్రి లోకేశ్ సమావేశం
- రాష్ట్ర విద్యావిధానంలో అమలు చేయాల్సిన మార్పులపై పలు సూచనలు
- ప్రతిభ ఆధారంగా హైస్కూల్ సీట్ల కేటాయింపు విధానాన్ని ప్రస్తావించిన టీచర్లు
- టీచర్ల వృత్తి నైపుణ్యం పెంచేందుకు సింగపూర్‌లో అమలు చేస్తున్న పద్ధతుల వివరణ
- ఉపాధ్యాయుల సూచనల అమలుపై ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేస్తామన్న లోకేశ్
సింగపూర్‌లో ఉపాధ్యాయులు ప్రతి వారం సమావేశమై సబ్జెక్టుల వారీగా చర్చించుకోవడం, వారి మధ్య సమన్వయం అద్భుతంగా ఉందని టీచర్లు తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్, రాష్ట్రంలో విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకే చాగంటి కోటేశ్వరరావు గారు రూపొందించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. తాను చదివిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఫైనల్ పరీక్షలకు ఇన్విజిలేటర్లు ఉండరని, 'ఆనర్ కోడ్' అనే స్వీయ క్రమశిక్షణ పాటిస్తారని, అందుకే ఎవరూ కాపీయింగ్ వంటివి చేయరని ఉదహరించారు. 'తల్లికి చెప్పలేని పని చేయొద్దు' అన్న చాగంటి గారి మాటలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని లోకేశ్ అన్నారు.
వివిధ జిల్లాల ఉపాధ్యాయుల సూచనలు
భీమిలికి చెందిన హెచ్ఎం తిరుమల శ్రీదేవి మాట్లాడుతూ.. సింగపూర్‌లో 'వెల్ నెస్ అంబాసిడర్స్', 'మెంటల్ హెల్త్ కౌన్సిలర్'ల నియామకం ద్వారా ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచుతున్నారని తెలిపారు. సీనియర్ టీచర్లు జూనియర్లకు మార్గనిర్దేశం చేయడం, పాఠశాల స్థాయిలో 'వెల్ బీయింగ్ కమ్యూనిటీస్', నెలవారీ కాంప్లెక్స్ మీటింగ్‌లు, స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్‌షాపులు, టీచర్ల విజయాలను వేడుకగా జరపడం వంటివి వారిని ప్రోత్సహిస్తున్నాయని వివరించారు.
ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపాల్ జాన్సన్ దేవరాజ్ మాట్లాడుతూ.. సింగపూర్‌లో విద్యార్థులు 'ప్రైమరీ స్కూల్ లెర్నింగ్ ఎగ్జామినేషన్'లో మంచి మార్కులు సాధిస్తేనే 6వ తరగతిలో సమీపంలోని మంచి పాఠశాలలో సీటు లభిస్తుందని చెప్పారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల స్థాయిలో నాణ్యత పెరుగుతుందని సూచించారు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ, విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోగలరా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
పల్నాడు జిల్లాకు చెందిన హెడ్ మాస్టర్ మోటా పార్వతి మాట్లాడుతూ.. సింగపూర్‌లో 'ఫ్యూచర్ ఫోకస్ ఎడ్యుకేషన్' అమలులో ఉందని, విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు వచ్చేసరికి ఏదో ఒక నైపుణ్యంతో వస్తున్నారని, దీనివల్ల ఉపాధి కోసం ఎదురుచూసే పరిస్థితి లేదని అన్నారు. గుంటూరుకు చెందిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గుమ్మడి షీలా మాధురి మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడలకు అక్కడ సమ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 శాతం స్పోర్ట్స్ కోటా క్రీడలకు ప్రోత్సాహకరంగా ఉందని, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమను సింగపూర్ పంపి ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచారని మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతపురం జిల్లా పామిడికి చెందిన ఏపీ మోడల్ స్కూలు ప్రిన్సిపాల్ అరుణ మాట్లాడుతూ.. సింగపూర్‌లో టీచర్లకు ఏటా వంద గంటల ఆన్లైన్ శిక్షణ తప్పనిసరి అని, దీనివల్ల ఏఐ వంటి అధునాతన టెక్నాలజీపై వారికి అవగాహన పెరుగుతుందని చెప్పారు. టీచర్లు మూడు నెలల పాటు తమకు ఆసక్తి ఉన్న పరిశ్రమల్లో పనిచేసే అవకాశం కూడా ఉందని, ఇది ఎంతో ఉపయోగకరమని అన్నారు. శ్రీకాళహస్తి మండలానికి చెందిన స్కూల్ అసిస్టెంట్ ఎన్. సుబ్రహ్మణ్య శర్మ, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన బండి శ్రీనివాసులు మాట్లాడుతూ.. సింగపూర్‌లోని 'ఫర్ ద టీచర్, బై ద టీచర్' విధానం, మెంటరింగ్ పద్ధతుల వల్ల ఉపాధ్యాయులు ఒత్తిడి లేకుండా బోధన చేయగలుగుతున్నారని తెలిపారు.
సూచనలపై ప్రత్యేక యంత్రాంగం: మంత్రి లోకేశ్
ఉపాధ్యాయుల సూచనలను సావధానంగా విన్న మంత్రి లోకేశ్, వారందరూ అద్భుతమైన సలహాలు ఇచ్చారని ప్రశంసించారు. "సింగపూర్ వెళ్లిన ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనల అమలుకు ఒక ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసి, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. అయితే, సంస్కరణలు విద్యార్థి కేంద్రంగా ఉండాలి. సింగపూర్ ఈ స్థాయికి రావడానికి ఐదారు దశాబ్దాలు పట్టింది. మనలో కూడా ఆ కసి, పట్టుదల రావాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'లీప్' యాప్‌ను కేవలం 2 శాతం తల్లిదండ్రులే డౌన్లోడ్ చేసుకున్నారు. తమ పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకుంటేనే వ్యవస్థలో మార్పు సాధ్యమవుతుంది" అని లోకేశ్ స్పష్టం చేశారు.




