శ్రేయస్ అయ్యర్ 'రెండో పుట్టినతేదీ'... 25/12/2025 వెనుక కథేంటి?
- టీమిండియా టీ20 కెప్టెన్సీకి ముందు ఇన్‌స్టా బయో మార్చిన శ్రేయస్
- 'రెండో పుట్టినతేదీ: 25.12.2025' అంటూ కొత్త ఎంట్రీతో చర్చకు తెరలేపిన వైనం
- ప్రాణాంతక గాయం నుంచి కోలుకున్న రోజుకు గుర్తుగానే ఈ మార్పు అని అంచనా
- ఐర్లాండ్‌పై నేడు కెప్టెన్‌గా తన తొలి టీ20 మ్యాచ్ ఆడనున్న అయ్యర్
గాయం నుంచి పునర్జన్మకు గుర్తుగా..!
ఈ 'రెండో పుట్టినతేదీ' వెనుక ఒక బలమైన, భావోద్వేగ కారణం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2025 అక్టోబర్ 25న సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఒక క్యాచ్ కోసం డైవ్ చేసినప్పుడు అతని ప్లీహానికి తీవ్ర గాయం కావడంతో పాటు అంతర్గత రక్తస్రావం జరిగింది. ఇది ప్రాణాంతక గాయం కావడంతో, అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ఈ గాయం కారణంగా అయ్యర్ దాదాపు రెండు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఈ సమయంలో గణనీయంగా బరువు కూడా తగ్గాడు. ప్రాణాలతో బయటపడటంతో, ఆ గాయం నుంచి కోలుకున్న డిసెంబర్ 25వ తేదీని తన 'రెండో జీవితం' ప్రారంభమైన రోజుగా అయ్యర్ భావిస్తున్నాడని, అందుకే దానిని తన రెండో పుట్టినతేదీగా బయోలో చేర్చాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నాయకత్వ పటిమతో ఉన్నత స్థానానికి
శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో నమ్మకమైన బ్యాటర్‌గానే కాకుండా నాయకుడిగానూ తనను తాను నిరూపించుకున్నాడు. గతంలో ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 2020లో ఫైనల్‌కు, 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను టైటిల్ విజేతగా, 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు నడిపించిన అద్భుతమైన ట్రాక్ రికార్డ్ అతనికి ఉంది. ఈ నాయకత్వ పటిమను గుర్తించిన బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అయ్యర్‌ను టీ20 కెప్టెన్‌గా నియమించింది. 2028 టీ20 ప్రపంచకప్‌ను లక్ష్యంగా చేసుకుని యువ జట్టును నిర్మించే ప్రణాళికలో భాగంగా ఈ నియామకం జరిగింది. ఈ జట్టులో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తొలిసారిగా చోటు దక్కడం విశేషం.
ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు, ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ గ్రౌండ్లో నేడు తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ ఇంగ్లండ్ పర్యటనకు సన్నాహకంగా ఉపయోగపడనుంది. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌ను విజయంతో ప్రారంభించాలని అయ్యర్ పట్టుదలగా ఉన్నాడు.