బెంగళూరులో బైక్‌ను ఢీకొట్టిన నటుడు దర్శన్ కుమారుడు.. అది దుష్ఫ్రచారమన్న తల్లి విజయలక్ష్మి

Vineesh Darshan Bengaluru road accident rumors dismissed by mother Vijayalakshmi
  • అది తప్పుడు ప్రచారమన్న దర్శన్ భార్య విజయలక్ష్మి
  • ప్రమాద సమయంలో కారు నడుపుతోంది వినీష్ కాదని వెల్లడి
  • బైకర్ల క్షేమసమాచారం కనుక్కోడానికే వినీష్ కారు దిగినట్లు స్పష్టీకరణ
  • ద్విచక్ర వాహనదారులే క్షమాపణలు చెప్పడంతో ముగిసిన వివాదం
కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప కుమారుడు వినీష్ రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన కుటుంబం ఖండించింది. బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌లో జరిగిన ఒక చిన్న రోడ్డు ప్రమాదం ఆధారంగా వినీష్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని దరశన్ భార్య విజయలక్ష్మి తూగుదీప సోషల్ మీడియా వేదికగా తప్పుపట్టారు.

రాజరాజేశ్వరి నగర్ రోడ్డుపై వెళ్తున్న ఒక ఫోర్డ్ ఎండీవర్ లగ్జరీ కారు, ఓ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన అనంతరం స్థానికులకు, కారులో ఉన్నవారికి మధ్య వాగ్వివాదం జరిగిందని, ఆ కారు దర్శన్ కుమారుడు వినీష్‌దేనంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. వినీష్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ నెటిజన్లు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు.

ఈ వార్తలపై విజయలక్ష్మి స్పందిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఆ సమయంలో కారును వినీష్ నడపడం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే కేవలం మానవతా దృక్పథంతో, ద్విచక్ర వాహనంపై ఉన్నవారికి ఏమైనా దెబ్బలు తగిలాయా? అని కనుక్కోవడానికి మాత్రమే వినీష్ కారు దిగి వారి వద్దకు వెళ్లాడని తెలిపారు.

అంతేకాకుండా, ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తప్పు ఏమీ లేదని విజయలక్ష్మి పేర్కొన్నారు. బైక్‌పై ఉన్నవారే అకస్మాత్తుగా కారు ముందుకు రావడంతో ఈ చిన్న ఘటన జరిగిందని, వారు అక్కడికక్కడే డ్రైవర్‌కు క్షమాపణలు కూడా చెప్పారని వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఇరువర్గాల మధ్య ఎలాంటి గొడవ జరగకుండానే విషయం సద్దుమణిగిందని ఆమె స్పష్టం చేశారు. కేవలం దర్శన్ కొడుకు అక్కడ ఉన్నాడనే కారణంతోనే కొందరు దీన్ని పెద్ద వివాదంగా చిత్రీకరిస్తున్నారని, దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆమె ప్రజలను కోరారు.

ప్రస్తుతం రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ జైలు శిక్ష అనుభవిస్తున్న తరుణంలో, ఈ కొత్త వివాదం వారి కుటుంబాన్ని మరింత ఒత్తిడికి గురిచేసింది. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, కేసు కూడా నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేయడంతో పుకార్లకు తెరపడింది.
Vineesh
Darshan Thoogudeepa
Vijayalakshmi Thoogudeepa
Bengaluru road accident
Ford Endeavour crash
Kannada actor son news

More Telugu News