సచిన్‌తో వైభవ్ సూర్యవంశీ పోలిక... కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు
- 15 ఏళ్ల వైభవ్ విషయంలో తొందరపడొద్దన్న కపిల్ దేవ్
- సచిన్‌లా ఎక్కువ కాలం ఆడగడలా చూడాలని వ్యాఖ్య
- ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపికైన వైభవ్.. అరంగేట్రానికి సిద్ధం
- ఆడితే సచిన్ రికార్డు బద్దలుకొట్టనున్న యువ సంచలనం
బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ, ఐర్లాండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో గనుక అతడు బరిలోకి దిగితే, భారత జట్టు తరఫున అత్యంత పిన్న వయసులో ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున, దేశవాళీ క్రికెట్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో వైభవ్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
బుధవారం నాడు కపిల్ దేవ్ మాట్లాడుతూ, "వైభవ్ చాలా చిన్న వయస్సులోనే అసాధారణ ప్రతిభను కనబరుస్తున్నాడు. సచిన్ లాగానే చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి వైభవ్ అడుగుపెడుతున్నాడు. అయితే, సచిన్ తరహాలో అతను సుదీర్ఘకాలం పాటు రాణించగలడా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. వైభవ్‌కు 20-22 ఏళ్ల వయసు వచ్చిన తర్వాతే అతడి సామర్థ్యంపై ఒక అంచనాకు రావాలి" అని పేర్కొన్నాడు. మరోవైపు, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సైతం వైభవ్ ప్రతిభను ప్రశంసించారు. ఇటీవల ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక-ఏ జట్టుపై కేవలం 11 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసి వైభవ్ రికార్డు సృష్టించిన విషయం విదితమే.