ఒక యూట్యూబర్ తీసిన సినిమాకు భారత్‌లో వసూళ్ల వర్షం!
- భారత్‌లో సంచలనం సృష్టిస్తున్న హాలీవుడ్ హారర్ చిత్రం 'అబ్సెషన్'
- కేవలం రూ.7.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం
- భారత్ లో రూ.79 కోట్లకు పైగా వసూళ్లు
- ఈ ఏడాది ఇండియాలో అతిపెద్ద హాలీవుడ్ హిట్‌గా నిలిచిన సినిమా
- భారత్‌లో వచ్చిన స్పందన చూసి షాక్ అయ్యానన్న 26 ఏళ్ల దర్శకుడు
కేవలం రూ.7.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, భారీ అంచనాలతో విడుదలైన 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' (రూ.75 కోట్లు) వసూళ్లను అధిగమించడం విశేషం. భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల జాబితాలో 'అబ్సెషన్' ప్రస్తుతం 28వ స్థానంలో ఉంది. మరో కోటి రూపాయలు వసూలు చేస్తే 'అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్' (రూ.80 కోట్లు) రికార్డును కూడా దాటేస్తుంది.
ఒకప్పుడు యూట్యూబర్‌గా ఉండి, దర్శకుడిగా మారిన 26 ఏళ్ల కర్రీ బార్కర్ ఈ విజయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత్‌లో తన సినిమాకు ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుందని తాను ఊహించలేదని అన్నారు. ప్రేక్షకులు సినిమాలోని సన్నివేశాలను రీక్రియేట్ చేస్తూ కామెడీ వీడియోలు చేయడం, ఫ్యాన్ ఆర్ట్ గీయడం వంటివి చూసి షాక్‌కు గురయ్యానని తెలిపారు.
ఈ విజయం అల్గారిథమ్‌ల కంటే ఫిలిం మేకర్స్‌పై నమ్మకం పెంచడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు బార్కర్ పేర్కొన్నారు. యువ దర్శకులు మంచి కాంట్రాక్టులు, క్రియేటివ్ కంట్రోల్ సాధించుకోవాలని సూచించారు. కాగా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 334 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.