కొందరు రిలాక్స్ అవుతున్నారు... అది కోవిడ్ కన్నా ప్రమాదకరం: నారా లోకేశ్

Nara Lokesh warns that relaxing after victory is more dangerous than COVID
  • వైసీపీ ఫేక్ ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని కేడర్‌కు లోకేశ్ పిలుపు
  • అధికారంలోకి వచ్చాక రిలాక్స్ అవ్వడం కోవిడ్ కన్నా ప్రమాదకరమన్న లోకేశ్
  • 'రెడ్ బుక్' తన పని తాను చేస్తుందని, ఎవరికీ అనుమానాలు అవసరం లేదని స్పష్టీకరణ
  • సర్వే ప్రక్రియ కారణంగా ఇంటింటికీ ప్రచారం కార్యక్రమం జులై 10కి వాయిదా
  • కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగుతుందని, అంతా కూటమి ధర్మానికి కట్టుబడాలని సూచన
గొడ్డలి పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని, ఫేక్ వార్తలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని, అదే సమయంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి-సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో, ఇప్పుడూ అదే స్ఫూర్తితో ఉండాలని స్పష్టం చేశారు.  కృష్ణా జిల్లా మోపిదేవిలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చాక కొందరు కార్యకర్తలు రిలాక్స్ అవుతున్నారని, ఇది కోవిడ్ కన్నా ప్రమాదకరమైన జబ్బు అని లోకేశ్ హెచ్చరించారు. "ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడతాం, అధికారంలోకి రాగానే రిలాక్స్ అయిపోతాం. కష్టకాలాన్ని మర్చిపోకూడదు. చిన్న పొరపాటు జరిగినా అలిగి ఇంట్లో కూర్చోవడం వల్ల నష్టపోయేది టీడీపీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలే" అని హితవు పలికారు. గొడ్డలి పార్టీ సృష్టించిన అడ్డంకులను అధిగమించి అధికారంలోకి వచ్చామని, ఈ స్ఫూర్తిని మరువొద్దని సూచించారు.

గత ప్రభుత్వంలో బూతుల మంత్రులు కృష్ణా జిల్లా పరువు తీశారని, కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. "మహనీయులు పుట్టిన ఈ జిల్లాలో ఒక బూతుల మంత్రి, ఇంకొకరు కార్యకర్తలను వేధించేవారు. భువనేశ్వరమ్మ గారిని కూడా అవమానించారు. వారి పేర్లను ఎర్రబుక్కులో రాస్తున్నానని ఆనాడే చెప్పాను. రెడ్ బుక్ తన పని తాను చేస్తుంది, దానిపై ఎవరికీ అనుమానాలు అవసరం లేదు" అని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని లోకేశ్ వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4,000 పింఛను, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద 3 సిలిండర్లు, తల్లికి వందనం రెండో విడత వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16,000 టీచర్ పోస్టులు, జాబ్ క్యాలెండర్ ద్వారా 10,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని, ఆ పనులకే రూ.2,000 కోట్లు ఖర్చయిందని విమర్శించారు. వైసీపీ అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించే ఫేక్ పార్టీ అని, వారి తప్పుడు ప్రచారాన్ని గ్రామ, మండల స్థాయిలో ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు.

"ఎస్ఐఆర్" ప్రక్రియ కొనసాగుతున్నందున 'ఇంటింటికీ ప్రచారం' కార్యక్రమాన్ని జులై 10వ తేదీ నుంచి ప్రారంభిస్తామని లోకేశ్ ప్రకటించారు. బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగుతుందని, "నో మిస్ ఫైర్, నో క్రాస్ ఫైర్, నో విడాకులు" అన్నదే తమ విధానమని తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఇతర నేతలు పాల్గొన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugu Desam Party
Andhra Pradesh Politics
Mopidevi TDP Meeting
TDP JSP BJP Alliance
Red Book AP

More Telugu News