అందుకే విద్యాశాఖను ఎంచుకున్నా.. విద్యార్థులు చదవకపోతే సీఎం నాకు మైనస్ మార్కులు వేస్తారు: మంత్రి లోకేశ్‌

Nara Lokesh chose education department for social change and warns students about CM marks
  • సంస్కరణలు పూర్తయ్యాయని, ఇక ఉపాధ్యాయులు బోధనపైనే శ్రద్ధ పెట్టాలని సూచన
  • ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమష్టి కృషితో ఏపీ మోడల్ విద్యను సాధిద్దామని పిలుపు
  • లీప్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు నేరుగా తనతో సమస్యలు పంచుకోవచ్చని వెల్లడి
  • కొక్కిలిగడ్డ హైస్కూలులో రూ.1.4 కోట్లతో నిర్మించిన నూతన భవనాల ప్రారంభోత్సవం
సమాజంలో మార్పు తీసుకురావాలనే బలమైన ఆకాంక్షతోనే తాను అత్యంత సవాలుతో కూడుకున్న విద్యాశాఖను ఎంచుకున్నానని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. విద్యావ్యవస్థలో సంస్కరణల దశ పూర్తయిందని, ఇకపై ఉపాధ్యాయులు పూర్తిగా బోధన, ఫలితాలపైనే దృష్టి సారించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారులు ఒక బృందంగా పనిచేసి దేశంలోనే ఆదర్శవంతమైన 'ఏపీ మోడల్ ఎడ్యుకేషన్'ను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.

అవనిగడ్డ నియోజకవర్గం, మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో 'పి4' పథకంలో భాగంగా దాతల సహకారంతో రూ.1.4 కోట్లతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాలను మంత్రి లోకేశ్‌ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత రెండేళ్లలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు (హార్డ్‌వేర్) గణనీయంగా మెరుగుపర్చామని, ఇప్పుడు అభ్యసన ఫలితాలు (సాఫ్ట్‌వేర్) మెరుగుపర్చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. 

"కొక్కిలిగడ్డ హైస్కూలులో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ మినహా అన్ని సౌకర్యాలు కల్పించాం. ఇక మీరు ఫలితాలపై దృష్టి పెట్టాలి. ఫార్మేటివ్, సమ్మెటివ్ పరీక్షల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సు మెటీరియల్ అందించి వారి సామర్థ్యాన్ని పెంచాలి. నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలి" అని లోకేశ్‌ సూచించారు.

ఉపాధ్యాయులతో ప్రత్యక్ష సంప్రదింపులకు 'లీప్ యాప్'
విధి నిర్వహణలో ఉపాధ్యాయులకు ఏవైనా సమస్యలు ఎదురైతే ఎంఈఓ, డీఈఓల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, నేరుగా 'లీప్ యాప్' ద్వారా తన దృష్టికి తీసుకురావచ్చని లోకేశ్‌ భరోసా ఇచ్చారు. వచ్చే నెల 16, 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని, తల్లిదండ్రుల స్మార్ట్‌ఫోన్లలో లీప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ చూపిన విద్యార్థుల చిత్రాలతో పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం ద్వారా వారిని ప్రోత్సహిస్తున్నామని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా కొందరు ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మెగా డీఎస్సీని కేవలం 155 రోజుల్లో పారదర్శకంగా పూర్తి చేసి, తమ కలలను సాకారం చేసినందుకు స్కూల్ అసిస్టెంట్ మనీష మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపడటంతో ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి 39 మంది కొత్తగా చేరారని టీచర్ షర్మిల చెప్పగా, మంత్రి వారిని అభినందించారు. పాఠశాలకు ప్లేగ్రౌండ్, పాల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు కోరగా, త్వరలోనే వాటిని సమకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలో 'క్లిక్కర్ టెక్నాలజీ'ని కూడా అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

మీరు చదవకపోతే సీఎం నాకు మైనస్ మార్కులు వేస్తారు!
అనంతరం 9, 10వ తరగతి విద్యార్థులతో లోకేశ్‌ సరదాగా ముచ్చటించారు. "దాతల సహకారంతో మీకు అద్భుతమైన భవనాలు సమకూరాయి. మీరు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధిస్తే ముఖ్యమంత్రి గారు నాకు మంచి మార్కులు వేస్తారు. ఒకవేళ మీరు సరిగా చదవకపోతే ఆయన నాకు మైనస్ మార్కులు వేస్తారు. నా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది" అని చమత్కరించడంతో విద్యార్థులు నవ్వుల్లో మునిగిపోయారు. 

విద్యార్థులకు ఇప్పటికే యూనిఫాం, పుస్తకాలు ఇచ్చామని, త్వరలోనే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్స్, బూట్లు కూడా అందిస్తామని తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత అత్యంత గౌరవనీయులు ఉపాధ్యాయులేనని, వారిని గౌరవిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Andhra Pradesh Education Department
Leap App AP
AP Model Education
Kokkiligadda High School
Mega DSC 2024

More Telugu News