మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగాలా? ఈ 4 విషయాలు నేర్పించండి!
- 10 ఏళ్లలోపు పిల్లలకు సామాజిక నైపుణ్యాలు కీలకం
- కొత్త గ్రూపుల్లో కలవడం నేర్పించాలి
- విభేదాలను ఆరోగ్యకరంగా ఎదుర్కోవాలి
- బాడీ లాంగ్వేజ్‌ను అర్థం చేసుకోవడం అవసరం
- భావాలను స్పష్టంగా చెప్పగలగాలి
1. కొత్త గ్రూపులో కలవడం
చాలా మంది పిల్లలకు కొత్తగా ఉన్న పిల్లల గుంపులోకి వెళ్లి మాట్లాడటం పెద్ద సవాలుగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఎలా చేరువ కావాలో నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. ముందుగా ఆ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించడం, తర్వాత సంభాషణలో భాగం కావడం అలవాటు చేయాలి. ఇలా చేస్తే కొత్త స్నేహాలు చేయడం సులభమవుతుంది.
2. విభేదించినా స్నేహాన్ని కొనసాగించడం
చిన్న చిన్న గొడవలను కూడా కొందరు పిల్లలు చాలా పెద్ద విషయంగా తీసుకుంటారు. స్నేహం ముగిసిపోయిందని భావిస్తారు. కానీ ప్రతి విషయంలో ఒకే అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. వేరే అభిప్రాయం ఉన్నా పరస్పర గౌరవంతో మాట్లాడటం నేర్పించాలి. ఇది భవిష్యత్తులో సంబంధాలను బలంగా ఉంచుతుంది.
3. మాటలతో పాటు సంకేతాలు
ఎదుటివారి ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్ కూడా చాలా విషయాలు చెబుతాయి. ఎవరైనా ఆసక్తి కోల్పోయినప్పుడు, అసౌకర్యంగా ఉన్నప్పుడు లేదా సంభాషణ ముగించాలని అనుకుంటున్నప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించడం పిల్లలకు నేర్పిస్తే ఇతరులతో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు.
4. కష్టమైన సమయంలో
చాలా మంది పిల్లలకు తమకు ఏమనిపిస్తుందో తెలిసినా దాన్ని చెప్పడం కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో సులభమైన వాక్యాలతో తమ అభిప్రాయాన్ని చెప్పడం నేర్పించాలి. ‘నాకు ఇది ఇష్టం లేదు’, ‘నేను ఇది చేయాలనుకోవడం లేదు’ వంటి మాటలు ధైర్యంగా చెప్పగలిగితే అనేక అసౌకర్య పరిస్థితులను ఎదుర్కోవడం సులభమవుతుంది.
ఎందుకు ముఖ్యమైనవి?
స్నేహితులను సంపాదించడానికే కాదు, జీవితంలో ప్రతి దశలో ఈ నైపుణ్యాలు ఉపయోగపడతాయి. ఇతరులతో మాట్లాడటం, సమస్యలు పరిష్కరించడం, భావోద్వేగాలను నియంత్రించడం, జట్టుగా పనిచేయడం వంటి అంశాలన్నీ వీటిపైనే ఆధారపడి ఉంటాయి. ఇవి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి.