సీఎం విజయ్ బర్త్‌డే స్పెషల్.. ఆ శిశువులకు బంగారు ఉంగరాల కానుక

Vijay Birthday Special Gold Rings Gifted to Newborns
  • నేడు సీఎం విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్త వేడుకలు
  • ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఇదే తొలి జన్మదినం
  • తూత్తుకుడి ఆసుపత్రిలో పుట్టిన ఆరుగురు శిశువులకు మంత్రి బంగారు ఉంగరాలు
  • ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు
  • మంత్రి శ్రీనాథ్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
నేడు తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ తన 52వ జన్మదినం జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఇదే తొలి పుట్టినరోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) శ్రేణులు, అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎం పుట్టినరోజైన జూన్ 22న తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన ఆరుగురు నవజాత శిశువులకు రాష్ట్ర మంత్రి బంగారు ఉంగరాలను బహుమతిగా అందించారు.

వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి ఎమ్మెల్యే, మంత్రి అయిన శ్రీనాథ్... సీఎం పుట్టినరోజున స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని సందర్శించారు. అదే రోజు అక్కడ ఆరుగురు శిశువులు జన్మించారని తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆ నవజాత శిశువులకు స్వయంగా బంగారు ఉంగరాలను తొడిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. సీఎం విజయ్‌పై తనకున్న అభిమానాన్ని మంత్రి ఈ విధంగా చాటుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు.

ముఖ్యమంత్రి విజయ్ జన్మదినం రోజు తమ బిడ్డలు పుట్టడం, ప్రభుత్వం తరఫున మంత్రి నుంచి బంగారు కానుకలు అందుకోవడం పట్ల ఆ శిశువుల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మంత్రి శ్రీనాథ్ చేసిన పనికి విజయ్ అభిమానులు ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రిగా విజయ్ తొలి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నటుడు కమల్ హాసన్, తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్, ఖుష్బూ వంటి రాజకీయ, సినీ రంగ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు.
Go Back to Shorts
Vijay
Tamilaga Vettri Kazhagam
Minister Srinath
Thoothukudi Government Hospital
Gold Rings Gift
Vijay Birthday Celebrations

More Telugu News