మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

Chiranjeevi met by Telangana BJP Chief Ramchander Rao
  • చిరంజీవి నివాసానికి వెళ్లిన రాంచందర్ రావు
  • కేంద్ర ప్రభుత్వ ప్రగతికి సంబంధించిన స్పెషల్ బుక్, బ్రోచర్లను అందించిన రాష్ట్ర బీజేపీ చీఫ్
  • ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమే అంటున్న బీజేపీ వర్గాలు

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు కలిశారు. చిరంజీవి నివాసానికి వెళ్లిన రాంచందర్ రావు... ఆయనతో భేటీ అయ్యారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ‘మహా జన్ సంపర్క్ అభియాన్’ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సమాజంలోని వివిధ రంగాల ప్రముఖులను కలిసి మోదీ ప్రభుత్వ విజయాలను వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే రామచందర్ రావు.. మెగాస్టార్‌ను కలిసి కేంద్ర ప్రభుత్వ ప్రగతికి సంబంధించిన ఒక స్పెషల్ బుక్, బ్రోచర్లను అందజేశారు.


దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో దేశ ఆర్థిక పురోగతి, సాంస్కృతిక పునరుజ్జీవనం, వినోద రంగం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిణామాలపై ఇరు ప్రముఖుల మధ్య ఆసక్తికర చర్చ సాగినట్లు సమాచారం. అయితే ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమైనదేనని, ప్రభుత్వ 12 ఏళ్ల విజయాల బుక్‌లెట్‌ను అందించడానికే కలిశామని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 


బీజేపీ నేతలు దీనిని క్యాజువల్ మీటింగ్ అంటున్నప్పటికీ, సోషల్ మీడియా నెటిజన్లు మాత్రం ఊరుకోవడం లేదు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసి, ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్న చిరంజీవి.. కాషాయ తీర్థం పుచ్చుకుని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా? అనే చర్చ మొదలైంది. ఆయన సోదరుడు, జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగుతుండగా... మెగాస్టార్ బీజేపీ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉందా? అంటూ విశ్లేషణలు గుప్పుమంటున్నాయి.

Go Back to Shorts
Chiranjeevi
Ramchander Rao
Telangana BJP
Maha Jan Sampark Abhiyaan
Narendra Modi
Pawan Kalyan

More Telugu News