నా జీవితంలో ఇద్దరే ముఖ్యం.. ఒకరు భారతీయురాలు, మరొకరు పాకిస్థానీ: జేడీ వాన్స్

JD Vance says only two people are important in his life one Indian and one Pakistani
  • అమెరికా-ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్‌లో కీలక శాంతి చర్చలు
  • పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై జేడీ వాన్స్‌ ప్రశంసలు
  • నా భార్య ఫేవరెట్ భారతీయురాలు, మునీర్ ఫేవరెట్ పాకిస్థానీ అని వ్యాఖ్య
  • ఇరాన్ అణు కార్యక్రమం, మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనే లక్ష్యంగా చర్చలు
  • ఈ చర్చల్లో పాకిస్థాన్, ఖతార్ మధ్యవర్తిత్వం
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, తనకు అత్యంత ఇష్టమైన ఇద్దరు వ్యక్తుల పేర్లను వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వారిలో ఒకరు భారతీయురాలు కాగా, మరొకరు పాకిస్థానీ కావడం గమనార్హం. తన భార్య ఉషా వాన్స్ తన ఫేవరెట్ ఇండియన్ అని, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ తన ఫేవరెట్ పాకిస్థానీ అని ఆయన అన్నారు. స్విట్జర్లాండ్‌లో అమెరికా-ఇరాన్ మధ్య నిన్న‌ ప్రారంభమైన చారిత్రక శాంతి చర్చల సందర్భంగా వాన్స్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్‌లో లేక్ లూసెర్న్ సమీపంలోని ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వాన్స్ మాట్లాడుతూ.. గత మూడు నెలల్లో తాను ఎవరికంటే ఎక్కువగా మునీర్‌తోనే మాట్లాడానని వెల్లడించారు. "ఫీల్డ్ మార్షల్ మునీర్ అద్భుతమైన సైనిక నాయకుడే కాదు, గొప్ప దౌత్యవేత్త అని కూడా నిరూపించుకున్నారు. ఆయన దౌత్య చతురత, నాయకత్వ పటిమ లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు" అని వాన్స్ కొనియాడారు. ఇస్లామాబాద్‌లో ప్రధానితో పాటు మునీర్ తమకు స్వాగతం పలికినప్పటి నుంచి ఈ విషయంపై తాను సరదాగా వ్యాఖ్యానిస్తున్నట్లు చెప్పారు.

కొన్ని నెలలుగా కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ వివాదానికి దౌత్యపరమైన పరిష్కారం లభించినందుకు వాషింగ్టన్ కృతజ్ఞతగా ఉందని వాన్స్ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఇరు దేశాల మధ్య ఎలక్ట్రానిక్‌గా కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని ఆయన ప్రస్తావించారు. "ఇకపై మనం కలిసి ఇంకెంత సాధించగలం అన్నదే మన ముందున్న ప్రశ్న. మధ్యప్రాచ్యంలో సంబంధాలను శాశ్వతంగా మార్చగలమా? లేదా పాత పద్ధతులకే వెనక్కి వెళ్తామా?" అని వాన్స్ వ్యాఖ్యానించారు. పాత పద్ధతులకు వెళ్లడం తమకు ఇష్టం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

పాకిస్థాన్, ఖతార్ దేశాల ప్రతినిధుల మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ తొలి విడత చర్చలు ప్రారంభించాయి. ఈ సమావేశాన్ని చారిత్రకంగా అభివర్ణించిన వాన్స్, ప‌శ్చిమాసియాలో అస్థిరతను తొలగించి, శాంతిని, హ‌ర్మూజ్ జలసంధి ద్వారా చమురు స్వేచ్ఛా రవాణాను ప్రోత్సహించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇంత ఉన్నత స్థాయిలో అమెరికా-ఇరాన్ భేటీ కావడం ఇదే తొలిసారని, ఇరాన్ ప్రజలతో తమ సంబంధాలను మార్చుకుని స్నేహ హస్తం చాచడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు జరపడం, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని పటిష్ఠం చేయడం వంటి కీలక అంశాలపై ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చిస్తున్నారు. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు వాన్స్‌తో పాటు ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ చర్చల్లో పాల్గొన‌గా, ఇరాన్ బృందానికి విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, చీఫ్ నెగోషియేటర్ మహమ్మద్ బాఘర్ ఘలీబాఫ్ నాయకత్వం వహిస్తున్నారు.
Go Back to Shorts
JD Vance
Usha Vance
Asim Munir
US Iran peace talks
Pakistan Army Chief
Middle East diplomacy

More Telugu News