మీలో మీరే మాట్లాడుకుంటున్నారా? మంచిదే అంటున్న పరిశోధకులు.. ఎలాగో చూద్దాం!
- మీతో మీరే మాట్లాడుకోవడం సహజమంటున్న నిపుణులు
- గట్టిగా మాట్లాడితే పనిపై నియంత్రణ పెరగొచ్చంటున్న అధ్యయనం
- వస్తువులు వెతికేటప్పుడు ఫోకస్ మెరుగుపడొచ్చని పరిశోధన
- చిన్నప్పటి నుంచే ఈ అలవాటు ఉంటుందని నిపుణుల వివరణ
- మన పేరుతో మనం సూచనలు ఇచ్చుకుంటే ఒత్తిడి తగ్గొచ్చన్న పరిశోధకులు
- స్వీయ సంభాషణను వింతగా చూడొద్దంటున్న పరిశోధకులు
గొంతులోనే దాగిన సైన్స్
మనసులో ఆలోచించడం ఒకటి అయితే, అదే విషయాన్ని గట్టిగా పలకడం మరోటి. బ్రిటన్‌లోని బాంగోర్ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టులు నిర్వహించిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరిశోధనలో పాల్గొన్న వారికి కొన్ని సూచనలు ఇచ్చారు. కొందరిని వాటిని మనసులో చదవమన్నారు. మరికొందరిని గట్టిగా చదవమన్నారు. ఆ తర్వాత వారితో ఓ పని చేయించారు. గట్టిగా చదివిన వారు పనిని మరింత సమర్థంగా పూర్తి చేసినట్లు గుర్తించారు. మనం చెప్పుకొన్న మాటలను మనమే వినడం వల్ల మెదడు ఆ సూచనలను మరింత స్పష్టంగా స్వీకరిస్తుందని పరిశోధకులు తెలిపారు.
వెతకడంలో కూడా ఉపయోగమే
ఏదైనా వస్తువు కనిపించకపోతే ‘‘తాళాలు... తాళాలు...’’ లేదా ‘‘ఫోన్ ఎక్కడ?’’ అంటూ వెతికే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇది కూడా ఉపయోగకరమేనని మరో అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిని కొన్ని వస్తువులను గుర్తించమన్నారు. వస్తువు పేరును గట్టిగా చెబుతూ వెతికిన వారు దాన్ని వేగంగా గుర్తించారు. అంటే మాటల రూపంలో మెదడుకు సంకేతం ఇవ్వడం వల్ల కళ్ల దృష్టి కూడా ఆ వస్తువుపైనే ఎక్కువగా కేంద్రీకృతమవుతుందని పరిశోధకులు గుర్తించారు. అందుకే ఏదైనా వస్తువు కోసం వెతుకుతున్నప్పుడు మీతో మీరే మాట్లాడుకోవడం సహజమే కాదు, ఉపయోగకరమని కూడా చెబుతున్నారు.
బాల్యంలోనే మొదలవుతుంది
మనతో మనం మాట్లాడుకోవడం పెద్దయ్యాక వచ్చిన అలవాటు కాదు. చిన్నప్పటి నుంచే అది మనలో ఉంటుంది. పిల్లలు ఆటల సమయంలో లేదా సమస్యలను పరిష్కరించే సమయంలో తమతో తాము మాట్లాడుకుంటూ ఉంటారు. రెండు నుంచి ఏడు సంవత్సరాల మధ్య పిల్లల్లో ఈ అలవాటు ఎక్కువగా కనిపిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది వారికి నిర్ణయాలు తీసుకోవడంలో, పనులను పూర్తి చేయడంలో, భావోద్వేగాలను నియంత్రించడంలో సాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ సంభాషణ బయటకు వినిపించకపోయినా మనసులో మాత్రం కొనసాగుతూనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఏ మాటలు మంచివి?
అన్ని రకాల స్వీయ సంభాషణలు ఒకేలా ఉపయోగపడవు. ‘‘నేను చేయలేను’’, ‘‘నాతో కాదు’’ వంటి ప్రతికూల మాటలు ఆందోళనను పెంచే అవకాశం ఉంటుంది. కానీ ‘‘ముందు ఇది చేద్దాం’’, ‘‘ఒక్కో దశగా పూర్తి చేద్దాం’’ వంటి సూచనాత్మక సంభాషణలు పనిపై దృష్టిని పెంచుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అలాగే ‘‘నేను చేయగలను’’ అనడం కంటే ‘‘సురేశ్... నువ్వు చేయగలవు’’ అని మన పేరుతో మనల్ని మనం ఉద్దేశించి మాట్లాడుకోవడం కొన్నిసార్లు మరింత ప్రభావవంతంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో భావోద్వేగ ఒత్తిడి కొంత తగ్గి, పరిస్థితిని మరింత ప్రశాంతంగా అంచనా వేసే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.