ఒక్క మాటతో భరోసా.. ఆన్‌లైన్‌లో హీరో అయిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్!

Cab driver becomes online hero with heartwarming assurance video viral
  • రాత్రిపూట ఒంటరిగా ప్రయాణిస్తున్న యువతికి భరోసానిచ్చిన క్యాబ్ డ్రైవర్
  • నా కారు నంబర్, అడ్రస్ ఫొటో తీసుకోండి అని చెప్పిన డ్రైవర్
  • ఆమె నా చెల్లెలి లాంటిది, మీ అన్న కారులో వెళ్తున్నట్టు భావించండి అంటూ భ‌రోసా
  • డ్రైవర్ మంచి మనసుపై నెటిజన్ల నుంచి ప్రశంసల వెల్లువ
సామాజిక మాధ్యమాల్లో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ, కొన్ని మాత్రమే మనసును హత్తుకుంటాయి. అలాంటి ఒక సంఘటనే ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. రాత్రిపూట ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ యువతి భద్రతపై ఆందోళన చెందుతున్న ఆమె సోదరుడికి, ఒక క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన భరోసా ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటోంది. ఈ చిన్న సంభాషణకు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు ఆ డ్రైవర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన లక్షయ్ మెహతా అనే వ్యక్తి తన సోదరిని గుర్గావ్ పంపించడానికి ఒక క్యాబ్ బుక్ చేశాడు. రాత్రి సమయం కావడంతో తన సోదరి భద్రత గురించి అతను ఆందోళన చెందాడు. కారు ఎక్కిన తర్వాత కూడా ప్రయాణంలో అప్‌డేట్స్ ఇస్తూ ఉండమని పదేపదే చెబుతూ ఉన్నాడు. సోదరుడి ఆందోళనను గమనించిన క్యాబ్ డ్రైవర్ కలుగజేసుకుని, వారిద్దరికీ ధైర్యం చెప్పాడు.

కారు బయట రాసి ఉన్న నా నంబర్, చిరునామా ఫొటో తీసుకోండి. "ఆమె కూడా నా సోదరి లాంటిదే" అని డ్రైవర్ చెప్పడంతో ఆ సోదరుడు కాస్త కుదుటపడ్డాడు. ఆ తర్వాత యువతితో "ఆందోళన పడకండి. ఇది మీ సోదరుడి కారు. హాయిగా కూర్చోండి" అని అన్నాడు. అంతటితో ఆగకుండా "మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా కూర్చోండి. మీ సొంత అన్నయ్య కారులోనే వెళ్తున్నట్టుగా భావించండి. మీ సోదరుడు ఒక యూట్యూబర్ అని నాకు తెలుసు. ఈ అమ్మాయిని నా సొంత చెల్లెలిలా సురక్షితంగా తీసుకెళ్తాను, ఏమీ ఫర్వాలేదు" అని భరోసా ఇచ్చాడు.

ఈ సంభాషణను లక్షయ్ మెహతా వీడియో తీసి 'ఎక్స్‌' (ట్విట్టర్)లో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. డ్రైవర్ చూపిన బాధ్యత, దయార్ద్ర హృదయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రయాణికుల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి మంచి మనుషులు కూడా ఉన్నారని, ఈ సంఘటన మానవత్వంపై నమ్మకాన్ని పెంచిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఎంతో హృద్యంగా ఉందని కొనియాడుతున్నారు. కేవలం కొన్ని మాటలతో ఒక కుటుంబానికి భరోసానిచ్చిన ఆ డ్రైవర్, ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోగా మారాడు.
Go Back to Shorts
Lakshay Mehta
Viral Cab Driver
Delhi Gurgaon Taxi
Women Safety Reassurance
Social Media Viral Video
Human Kindness Story

More Telugu News