ఆస్ట్రియాకు తొలిసారిగా భారత్ నుంచి కోడిగుడ్ల పొడి ఎగుమతి... ఒడిశా నుంచి చారిత్రక మైలురాయి

India exports egg powder to Austria for the first time a historic milestone from Odisha
  • ఒడిశాలోని బాలాంగిర్ నుంచి 22.6 మెట్రిక్ టన్నుల సరఫరా
  • విలువ ఆధారిత వ్యవసాయ ఎగుమతుల్లో కీలక పరిణామం
  • అపెడా ఆధ్వర్యంలో ఓవో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఘనత
  • యూరప్ మార్కెట్‌లో భారత పౌల్ట్రీ ఉత్పత్తులకు మార్గం సుగమం
భారత వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. దేశ చరిత్రలో తొలిసారిగా ఎండిన కోడిగుడ్ల పొడి (డ్రైడ్ హోల్ ఎగ్ పౌడర్) వాణిజ్యపరంగా ఆస్ట్రియాకు ఎగుమతి అయ్యింది. ఒడిశాలోని బాలాంగిర్ జిల్లా నుంచి 22.6 మెట్రిక్ టన్నుల సరుకును యూరప్‌కు పంపడం ద్వారా భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించింది.

ఒడిశాకు చెందిన ‘ఓవో ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్’ ఉత్పత్తి చేసిన ఈ సరుకును శనివారం వర్చువల్ విధానంలో అధికారులు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అపెడా (APEDA) చైర్మన్ అభిషేక్ దేవ్, ఒడిశా మత్స్య మరియు పశుసంవర్ధక శాఖ కమిషనర్-కమ్-సెక్రటరీ ప్రేమ్ చంద్, బాలాంగిర్ కలెక్టర్ గౌరవ్ శివాజీ ఇసల్వార్ తదితరులు పాల్గొన్నారు.

కోడిగుడ్లను పాశ్చరైజేషన్, స్ప్రే-డ్రైయింగ్ పద్ధతుల్లో పొడిగా మార్చడం ద్వారా అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. బేకరీ, కాన్ఫెక్షనరీ, నూడుల్స్ వంటి ఆహార తయారీ పరిశ్రమల్లో ఈ పొడికి విశేష డిమాండ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ శుద్ధి చేసిన పౌల్ట్రీ ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణకు ఈ పరిణామం నిదర్శనంగా నిలుస్తోంది.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని అపెడా ఈ ఎగుమతి ప్రక్రియకు పూర్తిస్థాయి సహకారం అందించింది. తాజా విజయంతో యూరప్ మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తులకు మరింత గుర్తింపు లభించడమే కాకుండా, ఒడిశాలోని వ్యవసాయాధారిత శుద్ధి రంగంలో (ఆగ్రో-ప్రాసెసింగ్) పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.                                
Go Back to Shorts
India
Egg powder export
Austria
Odisha agriculture
APEDA
Ovo Farm Private Limited

More Telugu News