చీర కట్టింది.. పిల్లలకు భారతీయ పేర్లు పెట్టింది.. విదేశీ తల్లి కథ వైరల్!

  • భారతీయుడిని వివాహం చేసుకున్న యూరప్ మహిళ
  • పిల్లల పెంపకంలో భారతీయ అలవాట్లకు ఫిదా
  • పిల్లలతో కలిసి నిద్రించే పద్ధతి నచ్చిందన్న క్సేనియా
  • నూనెతో మర్దన సంప్రదాయాన్ని ప్రశంసించిన మహిళ
  • పిల్లలకు పేర్లు  పెట్టే విధానంపై ప్రశంస
పిల్లల పెంపకానికి ఒక పద్ధతంటూ ఏమీ ఉండదు. ఒక్కో కుటుంబం ఒక్కో రకంగా పెంచుతుంటారు. కానీ ఈ విషయంలో కొన్ని సంప్రదాయాలు మాత్రం దేశాల సరిహద్దులు దాటి మనసులను గెలుచుకుంటాయి. అలాంటి అనుభవాన్నే పంచుకుంది యూరప్‌కు చెందిన క్సేనియా కాలా. భారతీయుడిని వివాహం చేసుకున్న ఆమె, నలుగురు పిల్లల తల్లిగా మారిన తర్వాత భారతీయ కుటుంబాల్లో కనిపించే కొన్ని అలవాట్లను తన జీవితంలో భాగం చేసుకుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పిన అనుభవాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ఒకే మంచంపై కుటుంబం
తన దేశంలో పిల్లలు ఐదేళ్ల వయసు వచ్చేసరికి ప్రత్యేక గదుల్లో పడుకునే అలవాటు ఉంటుందని క్సేనియా తెలిపింది. కానీ తల్లి అయిన తర్వాత ఆలోచన మారిపోయిందని చెప్పింది. పిల్లలతో ఒకే మంచంపై పడుకోవడం వల్ల వారితో బంధం మరింత బలపడిందని వెల్లడించింది. ముఖ్యంగా చిన్నపిల్లలకు పాలివ్వడం, రాత్రి సమయంలో చూసుకోవడం చాలా సులభమైందని వివరించింది. పిల్లలకు దగ్గరగా ఉండేందుకు ఇది సహజమైన మార్గంగా అనిపించిందని చెప్పింది.

మర్దనకు అభిమానిగా
భారతీయ కుటుంబాల్లో కనిపించే నూనె మర్దన సంప్రదాయం తనను బాగా ఆకట్టుకుందని క్సేనియా చెప్పింది. చిన్నారులకు నూనెతో మర్దన చేయడం ఆరోగ్యానికి మంచిదని, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని కూడా పెంచుతుందని అభిప్రాయపడింది. ముఖ్యంగా అమ్మమ్మలు, నానమ్మలు ఈ బాధ్యతలో భాగస్వాములు కావడం ఎంతో అందమైన విషయం అని పేర్కొంది. ఇది బిడ్డకే కాదు కొత్త తల్లికి కూడా మద్దతుగా ఉంటుందని చెప్పింది.

పేర్ల వెనుక అర్థం
పిల్లలకు పేర్లు పెట్టే భారతీయ విధానం కూడా తనకు ఎంతో నచ్చిందని క్సేనియా తెలిపింది. ఇక్కడ పేర్లు కేవలం పిలవడానికి మాత్రమే కాకుండా సంస్కృతి, చరిత్ర, విలువలతో ముడిపడి ఉంటాయని చెప్పింది. అందుకే తన పిల్లలకు కూడా భారతీయ పేర్లనే పెట్టినట్లు వెల్లడించింది. ప్రతి పేరులో ఒక కథ, ఒక భావం దాగి ఉండడం తనకు ప్రత్యేకంగా అనిపించిందని పేర్కొంది.

చీరలో పుట్టినరోజు సంబరాలు
భారతీయ తల్లులు పిల్లల పుట్టినరోజుల సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించడం తనను ఆకర్షించిందని క్సేనియా తెలిపింది. ముఖ్యంగా చీర కట్టుకుని వేడుకల్లో పాల్గొనడం ఆమెకు ఎంతో ఇష్టమట. పిల్లల పుట్టినరోజు అంటే తల్లికి కూడా ప్రత్యేక రోజేనని భావిస్తానని చెప్పింది. అందుకే తన పిల్లల పుట్టినరోజు వేడుకల్లో సాధ్యమైనంత వరకు చీరే ధరిస్తానని వెల్లడించింది.

సంప్రదాయాలు మారవు
భారతీయ సంప్రదాయాలను స్వీకరించడం అంటే తన మూలాలను వదిలేయడం కాదని క్సేనియా స్పష్టం చేసింది. నచ్చిన విషయాలను గమనించి, తన కుటుంబానికి సరిపోతాయని భావించిన వాటిని అలవాటుగా మార్చుకున్నానని చెప్పింది. మంచి ఆలోచన ఎక్కడి నుంచైనా రావచ్చని, పిల్లల పెంపకంలో సంస్కృతుల మధ్య నేర్చుకోవడం చాలా సహజమని అభిప్రాయపడింది.

Xenia Kala
Indian Parenting Traditions
Cross Cultural Marriage
Indian Names for Kids
European Woman Adopting Indian Culture
Saree for Birthday Celebrations

More Telugu News