చంద్రబాబు దేశంలోనే గొప్ప విజన్ ఉన్న లీడర్: బాబా రాందేవ్

Chandrababu Naidu is a leader with great vision says Baba Ramdev
  • ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం
  • కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు, బాబా రాందేవ్
  • అమరావతి దేవతల రాజధాని అని కొనియాడిన బాబా

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘యోగాంధ్ర’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ ఉదయం చారిత్రాత్మక ఉండవల్లి గుహల వేదికగా యోగా వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌తో కలిసి ప్రత్యేకంగా యోగాసనాలు వేయనున్నారు.


ఈ సందర్భంగా ఉండవల్లి గుహల వద్దకు చేరుకున్న బాబా రాందేవ్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు దేశంలోనే అత్యంత గొప్ప విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. గత 30 సంవత్సరాలుగా చంద్రబాబు ఈ దేశం కోసం, రాష్ట్రం కోసం ఏది అడిగితే తాము అది చేస్తూనే ఉన్నామని గుర్తుచేశారు. ఆయన అందరినీ సమానంగా చూసే గొప్ప లీడర్ కాబట్టే ప్రజలు ఆయన్ని దేవుడిలా భావిస్తారన్నారు.


రాజధాని అమరావతిపై రామ్‌దేవ్ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అమరావతి అనేది దేవతల రాజధాని. ఇదొక పవిత్రమైన దేవ భూమి. భవిష్యత్తులో ఇక్కడ 40 శాతం పచ్చదనం (గ్రీనరీ), 60 శాతం కాంక్రీట్ నిర్మాణాలు ఉంటాయి. ప్రకృతిని ఆస్వాదించడానికి ప్రజలు స్విట్జర్లాండ్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్‌కు వస్తే చాలు. ఇక్కడి ప్రకృతి సిద్ధంగా పండించిన మామిడికాయలు, అరటిపండ్లు అమృతంలా ఉంటాయి" అని ప్రశంసించారు.


యోగా అనేది మన ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాల్లో ఒక ముఖ్యమైన భాగమని రామ్‌దేవ్ బాబా స్పష్టం చేశారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్’ (Yoga for Healthy Aging) అనే ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Go Back to Shorts
Chandrababu Naidu
Baba Ramdev
International Yoga Day
Amaravati Capital
Yogandhra Program
Andhra Pradesh News

More Telugu News