సాయికృష్ణ అదృశ్యంపై జగన్ కుల రాజకీయం: వర్ల రామయ్య

Varla Ramaiah slams Jagans caste politics over Sai Krishna disappearance
  • రాజకీయ లబ్ధి కోసమే జగన్ ప్రయత్నిస్తున్నారన్న వర్ల రామయ్య
  • కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపణ
  • తమ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని వెల్లడి
  • వైసీపీ హయాంలోని ఘటనలను గుర్తు చేసిన టీడీపీ
విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనను అడ్డం పెట్టుకుని, కాపు సామాజిక వర్గంలో సెంటిమెంట్‌ను రగిల్చడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సున్నితమైన అంశాన్ని జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ఈ ఘటనపై ఎన్డీయే ప్రభుత్వం తక్షణమే స్పందించిందని వర్ల రామయ్య స్పష్టం చేశారు. ఇప్పటికే కృష్ణలంక సీఐ నాగార్జునను సస్పెండ్ చేయడంతో పాటు, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నేతృత్వంలో సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ఆయన గుర్తుచేశారు. బాధ్యులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

గత వైసీపీ పాలనలో బీసీ యువకుడు అమర్నాథ్ గౌడ్‌ను సజీవ దహనం చేసినా, పులివెందులలో దళిత మహిళపై దారుణంగా దాడి జరిగినా జగన్ ఆయా కుటుంబాలను పరామర్శించలేదని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఇప్పుడు కేవలం కాపు సామాజిక వర్గం సానుభూతిని పొందేందుకే జగన్ ఈ కేసును రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ గత మే నెల నుంచి అదృశ్యమైన విషయం విదితమే. పోలీసుల విచారణ పేరుతో తీసుకెళ్లిన తర్వాతే అతను కనబడకుండా పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది కస్టోడియల్ డెత్ అయి ఉండవచ్చని అనుమానిస్తూ వారు హైకోర్టులో ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసు విచారణ, కోర్టు ప్రక్రియ కొనసాగుతుండగా, దీని చుట్టూ రాజకీయ ఆరోపణలు తీవ్రరూపం దాల్చాయి.                                
Go Back to Shorts
Varla Ramaiah
YS Jagan Mohan Reddy
Gade Sai Krishna
Vijayawada
Kapu Community
TDP vs YSRCP

More Telugu News