పసిఫిక్ మహాసముద్రంలో ‘జగ్మి’ తుపాను ఎఫెక్ట్.. రుతుపవనాల ఎనర్జీని లాగేసుకున్న వైనం!
- జూన్ 4న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
- ప్రస్తుతం దక్షిణ మహారాష్ట్ర పరిసరాల్లో పూర్తిగా స్తంభన
- జూన్ మొదటి రెండు వారాల్లో 42.6 మి.మీ వర్షపాతం నమోదు
- మధ్య భారత దేశంలో భారీ వర్షపాత లోటు
- బలహీనమైన సోమాలి జెట్ వాయుప్రవాహాలతో రుతుపవనాలకు బ్రేక్
- జూన్ 23 నాటికి రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటాయన్న ఐఎండీ
రుతుపవనాలు ఇలా అకస్మాత్తుగా స్థంభించిపోవడానికి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన పర్యావరణ పరిస్థితులతో పాటు బహుళ వాతావరణ వ్యవస్థల ప్రతికూల ప్రభావమే కారణమని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. జూన్ ఆరంభంలో హిందూ మహాసముద్రంలో రుతుపవనాల కదలికలు బాగానే ఉన్నప్పటికీ, పసిఫిక్ ప్రాంతంలో ఏర్పడిన ‘జగ్మి’ తుపాను కారణంగా వాతావరణ శక్తి అంతా తూర్పు వైపునకు మళ్లింది. దీనివల్ల రుతుపవనాలను ముందుకు నెట్టేందుకు బంగాళాఖాతంలో ఏర్పడాల్సిన వాయుగుండం రూపుదాల్చలేదు. దీనికి తోడు ఉత్తర భారతదేశం నుంచి వీచిన పొడి గాలులు, రుతుపవన ద్రోణి బలహీనపడటం, హిందూ మహాసముద్రం మీదుగా వీచే సోమాలి జెట్ విండ్స్ (తక్కువ ఎత్తులో వీచే గాలులు) నెమ్మదించడం, ‘మ్యాడెన్-జూలియన్ ఆసిలేషన్’ (ఎంజేవో) అనుకూలంగా లేకపోవడం వంటి ఐదు ప్రధాన కారణాలు ఏకకాలంలో రుతుపవనాల ప్రగతిని అడ్డుకున్నాయి. వాతావరణ నిపుణుడు నవదీప్ దహియా శాటిలైట్ చిత్రాల ఆధారంగా స్పందిస్తూ జూన్ 23 లోపు రుతుపవనాలు కోలుకునే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు.
ఈ నెమ్మదించిన రుతుపవనాల ప్రభావం ఇప్పటికే దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై పడటం ప్రారంభమైంది. జూన్ మాసంలో ఖరీఫ్ సాగు కింద వరి, సోయాబీన్, పప్పుధాన్యాల నారు పోసే రైతులకు ఈ వాతావరణం పెద్ద సవాలుగా మారింది. వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్ దేవేంద్ర శర్మ మాట్లాడుతూ.. ఈ ఏడాది ‘సూపర్ ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని, దీనివల్ల కనీసం 12 రాష్ట్రాలలో వ్యవసాయ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇది గ్రామీణ ఆదాయాన్ని, ఆహార ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పారు. మహారాష్ట్ర, గోవా వంటి ప్రాంతాలలో జలాశయాలు ఎండిపోవడంతో ఇప్పటికే తాగునీటి కోతలు విధిస్తున్నారు. అయితే, జూన్ నాలుగో వారం నుంచి ఎంజేవో అనుకూల దశలోకి మారనుండటంతో జూన్ 23 నాటికి రుతుపవనాలు మళ్లీ పుంజుకుని మహారాష్ట్రతో పాటు తెలంగాణ, ఒడిశా, ఝార్ఖండ్, బిహార్, ఛత్తీస్గఢ్ లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.