బెంగుళూరులో విచిత్ర ఘటన.. మొబైల్ దొంగిలించి పారిపోతూ గుండెపోటుతో దొంగ మృతి!
- బెంగుళూరు కబ్బన్‌పేటలో ఘటన
- లాయర్ మొబైల్ ఫోన్ లాక్కొని బైక్‌పై దొంగల పరార్
- బాధితుడి కేకలు విని దొంగల బైక్ పైకి పెద్ద మూట విసిరిన కూలీ
- బైక్ నియంత్రణ కోల్పోయి కిందపడిన దొంగలు
- ఫోన్ వదిలేసి పరుగు తీసిన నిందితులు
- 250 మీటర్లు పరిగెత్తిన తర్వాత నిందితుల్లో ఒకడికి గుండెనొప్పి
- ఫుట్‌పాత్‌పైనే కుప్పకూలి మరణించిన వైనం
ప్రమాదాన్ని గమనించిన దొంగలు మొబైల్ ఫోన్, బైక్‌ను కూడా వదిలేసి పరుగు ప్రారంభించారు. దాదాపు 250 మీటర్ల దూరం పరుగెత్తిన తర్వాత, అందులో ఒక నిందితుడు తీవ్రమైన ఛాతి నొప్పితో రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్‌ను పట్టుకుని ఫుట్‌పాత్‌పై కూర్చుండిపోయాడు. ఆపై స్పృహ తప్పి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. బాధితుడిని పదరాయనపుర ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల జునైద్‌గా పోలీసులు గుర్తించారు. జునైద్ తల్లిదండ్రులు అందించిన సమాచారం ప్రకారం.. అతడికి గతంలోనే తీవ్రమైన గుండె జబ్బు ఉందని, దానికి సంబంధించి గుండె ధమనిలో స్టెంట్ కూడా అమర్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. పట్టుబడతామనే భయం, ఒత్తిడితో పరుగెత్తడం వల్లే అతడికి గుండెపోటు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
దొంగల ఛేజింగ్, నిందితుడు కుప్పకూలిన దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న హలసూరు గేట్ పోలీసులు పారిపోవడానికి ప్రయత్నించిన రెండో నిందితుడు అర్బాజ్ (21)ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మరణించిన జునైద్ మొదటిసారి నేరానికి పాల్పడగా, పట్టుబడిన అర్బాజ్ మాత్రం నగరంలో పాత నేరస్తుడని, అతడిపై గతంలోనే పలు మొబైల్ స్నాచింగ్, బైక్ చోరీ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.