అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. సిమ్యులేటర్ డేటాతో కొత్త అంశాలను బయటపెట్టిన పైలట్లు!
- ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై పైలట్ల సమాఖ్య సంచలన ఆరోపణలు
- పైలట్ ఆత్మహత్య వాదన అబద్ధం.. భారీ విద్యుత్ వైఫల్యమే కారణమని వెల్లడి
- సిమ్యులేటర్ పరీక్షల్లో ప్రభుత్వ నివేదికలోని సాంకేతిక అంశాలు అసాధ్యమని నిరూపణ
- నిపుణులను పక్కనపెట్టి నిజాలు దాస్తున్నారని దర్యాప్తు సంస్థలపై తీవ్ర విమర్శలు
- తుది నివేదికను ఆపాలని, పూర్తిస్థాయిలో పునఃపరిశీలన చేయాలని డిమాండ్
గత ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ 171 ప్రమాదంపై కొత్త వివాదం రాజుకుంది. ఈ దుర్ఘటన పైలట్ ఆత్మహత్య వల్లే జరిగిందన్న అధికారిక వాదనను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎఫ్ఐపీ) తీవ్రంగా సవాల్ చేసింది. ఇది ఆత్మహత్య కాదని, విమానంలో తలెత్తిన భారీ విద్యుత్ వైఫల్యం వల్లే ప్రమాదం జరిగిందని, అందుకు తమ వద్ద తిరుగులేని సాంకేతిక ఆధారాలున్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎఫ్ఐపీ అధ్యక్షుడు కెప్టెన్ సి.ఎస్. రంధావా మీడియా సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు.
ప్రభుత్వ దర్యాప్తు సంస్థల మధ్యంతర నివేదిక ప్రకారం... ఓ పైలట్ ఉద్దేశపూర్వకంగా ఇంధన సరఫరాను నిలిపివేయడంతో విమానం కూలిపోయిందని పేర్కొన్నారు. ఇంధన సరఫరా నిలిచిన కేవలం 4 సెకన్లలోనే విమానంలోని అత్యవసర విద్యుత్ వ్యవస్థ అయిన 'రామ్ ఎయిర్ టర్బైన్' (ఆర్ఏటీ) యాక్టివేట్ అయిందని నివేదిక తెలిపింది. అయితే, ఈ వాదనను ఎఫ్ఐపీ పూర్తిగా తోసిపుచ్చింది. ప్రమాద సమయంలోని బరువు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తాము నిర్వహించిన సిమ్యులేటర్ పరీక్షల్లో భిన్నమైన ఫలితాలు వచ్చాయని రంధావా తెలిపారు.
"మా సిమ్యులేటర్ పరీక్షల ప్రకారం పైలట్లు ఇంధన సరఫరాను మాన్యువల్‌గా నిలిపివేస్తే, బ్యాకప్ టర్బైన్ పనిచేయడానికి కనీసం 18 సెకన్ల సమయం పడుతుంది. కానీ, అధికారిక నివేదికలో చెప్పినట్లు కేవలం 4 సెకన్లలోనే అది యాక్టివేట్ కావడం భౌతికంగా, సాంకేతికంగా అసాధ్యం" అని ఆయన వివరించారు. విమానంలో ఒక్కసారిగా భారీ విద్యుత్ వైఫల్యం సంభవించడం వల్లే బ్యాకప్ టర్బైన్ అంత వేగంగా పనిచేయడం మొదలుపెట్టిందని, ఆ తర్వాతే ఇంజిన్ స్విచ్‌లు ట్రిప్ అయ్యాయని ఎఫ్ఐపీ వాదిస్తోంది.
ఈ వాదనకు బలం చేకూరుస్తూ మరిన్ని ఆధారాలను ఎఫ్ఐపీ తెరపైకి తీసుకువచ్చింది. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు, విమానం కిందకు పడిపోవడానికి ముందు క్యాబిన్‌లోని లైట్లు మిణుకుమిణుకుమన్నాయని చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. ఇది విద్యుత్ వైఫల్యం వాదనకు సరిగ్గా సరిపోతుందని పేర్కొంది. అంతేకాకుండా ప్రమాదానికి గురైన విమానంలో గతంలోనూ పలుమార్లు విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తినట్లు రికార్డులు ఉన్నాయని సమాఖ్య తెలిపింది.
దర్యాప్తు తీరుపై కూడా ఎఫ్ఐపీ తీవ్ర ఆరోపణలు చేసింది. భారత్‌లో అత్యుత్తమ బోయింగ్ 787 నిపుణుడిగా పేరున్న కెప్టెన్ ఆర్.ఎస్. సంధును ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తు పరీక్షల నుంచి తప్పించారని రంధావా ఆరోపించారు. "ఆయనకున్న పరిజ్ఞానంతో 'పైలట్ సూసైడ్' థియరీ తప్పని తేలిపోతుంది. అందుకే ఆయన్ను పక్కనపెట్టారు. చనిపోయిన పైలట్లు తమను తాము సమర్థించుకోలేరు కాబట్టి, వారిపై నిందలు వేయడం సులభం. కానీ, విమానంలోని యాంత్రిక లేదా సాఫ్ట్వేర్ లోపాన్ని అంగీకరించడం ఇష్టం లేకే ఈ కుట్ర చేస్తున్నారు" అని రంధావా ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో తమ సిమ్యులేటర్ డేటాను, పరిశోధన ఫలితాలను బోయింగ్ సంస్థకు, ప్రభుత్వ ఏవియేషన్ అధికారులకు సమర్పించినట్లు ఎఫ్ఐపీ ధ్రువీకరించింది. టర్బైన్ యాక్టివేషన్ సమయంపై ఉన్న సాంకేతిక వైరుధ్యాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపే వరకు ప్రమాద తుది నివేదిక ప్రచురణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. పారదర్శక దర్యాప్తు కోసం కెప్టెన్ సంధును వెంటనే విచారణ బృందంలో తిరిగి చేర్చుకోవాలని కోరింది. ఎఫ్ఐపీ చేసిన ఈ ఆరోపణలతో విమాన ప్రమాద దర్యాప్తు మరోసారి కీలక మలుపు తీసుకుంది.