మా అత్త త్వరగా చనిపోయేలా చూడు స్వామీ.. అనంతపురం ఆలయ హుండీలో కోడలి వింత మొక్కు.. అవాక్కైన అధికారులు!

  • అనంతపురం జిల్లా ఆలయ హుండీలో వెలుగులోకి వచ్చిన వింత కోరిక 
  • మా అత్త చనిపోవాలంటూ ఓ మహిళ కరెన్సీ నోటుపై రాసి హుండీలో వేసిన వైనం
  • అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నానని నోటుపై రాసిన స‌ద‌రు మహిళ
  • కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిళ్లకు ఇది నిదర్శనమని చర్చ
సాధారణంగా గుడికి వెళ్లిన భక్తులు తమకు మంచి జరగాలని, ఉద్యోగం రావాలని, ఆరోగ్యం కుదుటపడాలని దేవుడిని కోరుకుంటారు. కానీ, ఓ మహిళ మాత్రం తన అత్త చనిపోవాలని దేవుడికి మొరపెట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. తన కోరికను కరెన్సీ నోటుపై రాసి హుండీలో వేసిన ఈ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. హుండీ లెక్కింపు సందర్భంగా ఈ వింత కోరికను చూసి అధికారులు, భక్తులు నిర్ఘాంతపోయారు.

వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరులో ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. తాజాగా ఆలయ అధికారులు హుండీ కానుకలను లెక్కించడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారికి కొన్ని 20 రూపాయల నోట్లు కనిపించాయి. వాటిపై రాసి ఉన్న రాతలు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఓ నోటుపై "స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను.. తొందరగా మా అత్త చనిపోయేలా చూడు" అని రాసి ఉండగా, మరో నోటుపై "స్వామీ.. మా అత్త త్వరగా చనిపోవాలి" అని రాసి ఉంది.

ఈ విషయం బయటకు తెలియడంతో స్థానికంగా కలకలం రేగింది. అత్తగారి మరణాన్ని కోరుతూ ఓ కోడలు ఏకంగా దేవుడికే మొక్కుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కుటుంబంలో అత్త పెట్టే హింసలు, వేధింపులు ఏ స్థాయికి చేరితే ఓ కోడలు ఇంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుందని పలువురు చ‌ర్చించుకుంటున్నారు. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక, మానసిక ఒత్తిడితో ఆ మహిళ ఈ విధంగా దేవుడికి తన ఆవేదనను తెలియజేసి ఉంటుంద‌ని అభిప్రాయపడుతున్నారు. 

ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు
ఆలయాల హుండీలను ప్రజలు కేవలం కానుకలు సమర్పించడానికే కాకుండా తమ ఆవేదనలు, ఫిర్యాదులు, అభిప్రాయాలు తెలిపే వేదికగా కూడా వాడుకుంటున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. రెండు నెలల క్రితం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో సౌకర్యాలు సరిగా లేవంటూ ఓ భక్తుడు రాసిన లేఖ హుండీలో లభించడం సంచలనం సృష్టించింది. అలాగే, గతేడాది అనంతపురం జిల్లాలోనే ఓ ఆలయంలో దొంగతనం చేసిన వ్యక్తులు, నెల రోజుల తర్వాత ఆ డబ్బును తిరిగి హుండీలో వేసి, క్షమించమంటూ ఓ లేఖను కూడా వదిలి వెళ్లారు. 

Subramanya Swamy Temple
Daughter in law
Mother in law death wish
Anantapur Temple Hundi
Currency note message
Andhra Pradesh news

More Telugu News