టీమిండియా కోచ్‌ను మార్చేయండి.. జ‌ట్టుకు ధోనీలాంటి మెంటార్ కావాలి: శ్రీశాంత్

  • భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ పేసర్ శ్రీశాంత్ తీవ్ర విమర్శలు
  • టీమిండియాకు కోచ్ కాదు, ధోనీ లాంటి మెంటార్ అవసరమని వ్యాఖ్య
  • గంభీర్ ఆటగాళ్లపై అనవసరమైన ఒత్తిడి పెడుతున్నారని ఆరోపణ
  • స్వదేశంలో టెస్టు సిరీస్ ఓటములకు గంభీర్ కోచింగే కారణమని విమర్శ
  • టీ20 ప్రపంచకప్ విజయం ఘనత గంభీర్‌ది మాత్రమే కాదని వ్యాఖ్య
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్. శ్రీశాంత్, ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు గంభీర్ లాంటి కోచ్ అవసరం లేదని, ఎంఎస్ ధోనీ వంటి ఒక మెంటార్ ఉంటే జట్టుకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. గంభీర్ కోచింగ్ విధానం ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి పెడుతోందని, ఇది జట్టు ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపుతోందని విమర్శించాడు.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో టెస్టు క్రికెట్‌లో భారత జట్టు ప్రదర్శన పేలవంగా ఉండటానికి గంభీర్ కోచింగే కారణమని శ్రీశాంత్ ఆరోపించాడు. "2024లో న్యూజిలాండ్, 2025లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లలో భారత్ ఓడిపోయింది. ఈ రెండు పరాజయాలు గంభీర్ కోచ్‌గా ఉన్నప్పుడే జరిగాయి. ఆయన ఆటగాళ్లపై అనవసరమైన ఒత్తిడి పెడతారు. ఆ విధానం నాకు నచ్చదు" అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.

కోచ్ స్థానంలో మెంటార్ ఉండాలనే వాదనను శ్రీశాంత్ బలంగా వినిపించాడు. "కోచ్‌ను మార్చేయండి మిత్రమా. భారత్‌కు కోచ్ కాదు, ఒక మెంటార్ కావాలి. గెలిచినప్పుడు నవ్వి, ఓడిపోయినప్పుడు కోప్పడటం సరైన పద్ధతి కాదు. ముందుగా ఆటగాళ్లకు సోదరుడిగా అండగా నిలవాలి. దేశం కోసం మీరు బాగా ఆడారు, అది గొప్ప విషయమే. కానీ దాని అర్థం ఇతరులు ప్రయత్నించడం లేదని కాదు కదా" అని గంభీర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ జట్టుకు ఒత్తిడి పెంచే కోచ్ అవసరం లేదని, ధోనీ ఎప్పుడూ అలా చేయలేదని ఉదహరించాడు. టీమిండియాకు ధోనీలాంటి మెంటార్ అవసరమని శ్రీశాంత్ గట్టిగా సూచించాడు.

ఇక‌, 2026 టీ20 ప్రపంచకప్ విజయం క్రెడిట్ అంతా గంభీర్‌కే దక్కుతోందన్న వాదనను కూడా శ్రీశాంత్ తోసిపుచ్చాడు. "జట్టు ప్రపంచకప్ గెలిచినప్పుడు క్రెడిట్ అంతా గంభీర్‌కే ఇచ్చారు. కానీ, ఆ మ్యాచ్‌లో సంజూ శాంసన్ లేకపోయినా, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయకపోయినా, సరైన సమయంలో బౌలింగ్ మార్పులు జరగకపోయినా మనం గెలిచేవాళ్లమా?" అని ప్రశ్నించాడు. మైదానంలో నిర్ణయాలు తీసుకునేది కోచ్ కాదని, ఆటగాళ్ల ప్రదర్శనే కీలకమని పరోక్షంగా చురకలంటించాడు. ఆటలో పూర్తిగా నిమగ్నమై ఉండే ఆశిష్ నెహ్రాలాంటి కోచ్ ఉంటే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు.

Sreesanth
Gautam Gambhir
MS Dhoni
Team India Coach
Indian Cricket Team
Ashish Nehra

More Telugu News