సైఫ్ అలీ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు... కానీ అమృతా సింగ్ మాత్రం సింగిల్.. కారణం ఇదే!
- సైఫ్‌తో విడాకుల తర్వాత ఒంటరి జీవితంపై అమృతా సింగ్ పాత ఇంటర్వ్యూ వైరల్
- మళ్లీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదంటూ చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్
- ఒక పురుషుడి నుంచి కావాల్సినవి నా దగ్గర ఉన్నాయన్న అమృత
- పిల్లల కోసం ధైర్యంగా నిలబడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడి
నటి పూజా బేడీ నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలో, పునర్వివాహం చేసుకునే ఆలోచన ఉందా అని అమృతను ప్రశ్నించగా.. ఆమె తనదైన శైలిలో సమాధానమిచ్చారు. "అవునని లేదా కాదనో సమాధానం చెప్పడానికి నేనేమీ 16 ఏళ్ల అమ్మాయిని కాదు. నిజానికి, ఒక పురుషుడు ఇవ్వగలిగేవన్నీ నాకు ఉన్నాయి. కేవలం కొన్ని అవసరాల కోసం మళ్లీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు కనిపించడం లేదు" అని ఆమె కుండబద్దలు కొట్టారు.
అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్ 1991లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఇద్దరు సంతానం. దాదాపు 13 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత 2004లో ఈ జంట విడాకులు తీసుకుంది. అనంతరం సైఫ్ 2012లో కరీనా కపూర్‌ను వివాహం చేసుకోగా, అమృత మాత్రం ఒంటరిగానే ఉంటూ తన పిల్లల బాధ్యతలను భుజాన వేసుకున్నారు.
విడాకుల తర్వాత తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురించి కూడా అమృత ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రారంభంలో మానసికంగా కొంత కుంగిపోయినప్పటికీ, తన పిల్లల భవిష్యత్తు కోసం ధైర్యంగా నిలబడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. "పరిస్థితులకు తలవంచి ఓటమిని అంగీకరించడం నా పిల్లలు నేర్చుకోవడం నాకు ఇష్టం లేదు" అని ఆమె వివరించారు. ప్రస్తుతం ఈ పాత వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, ఆమె వ్యక్తిగత జీవితంపై నెటిజన్లలో మరోసారి ఆసక్తి నెలకొంది.