ఏపీకి రండి.. బెంగళూరు స్టార్టప్‌కు మంత్రి లోకేశ్ ఇన్విటేషన్.. కాసేపట్లోనే రెస్పాన్స్

  • బెంగళూరులో భూ సమస్యలపై స్పేస్-టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడి పోస్ట్
  • వెంటనే స్పందించి ఏపీకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేశ్
  • బెంగళూరు శివార్లలో అనంతపురం అనువైనదని వెల్లడి
  • ఏపీ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమన్న పిక్సెల్ స్టార్టప్
బెంగళూరులో ఎదురవుతున్న సమస్యలను ఆంధ్రప్రదేశ్‌కు అవకాశాలుగా మలుచుకోవడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి తనదైన శైలిలో చొరవ చూపారు. భూమి కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులపై ఓ ప్రముఖ స్పేస్-టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వెంటనే స్పందించిన లోకేశ్.. ఆ సంస్థను ఏపీకి ఆహ్వానించారు.

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పిక్సెల్ (Pixxel) అనే స్పేస్-టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు క్షితిజ్ ఖండేల్వాల్, తమ శాటిలైట్ తయారీ కేంద్రం కోసం నగరం శివార్లలో భూమిని సేకరించడం, శాటిలైట్లను అభివృద్ధి చేయడం కంటే కష్టంగా మారిందని 'ఎక్స్' వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి. పాటిల్ స్పందిస్తూ, సమస్యను పరిశీలిస్తామని బదులిచ్చారు.

ఈ అవకాశాన్ని ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే అందిపుచ్చుకున్నారు. క్షితిజ్ పోస్ట్‌ను రీపోస్ట్ చేస్తూ, బెంగళూరు శివార్లలోని పెట్టుబడిదారులకు స్నేహపూర్వక గమ్యస్థానంగా అనంతపురం ఉందని హైలైట్ చేశారు. స్పేస్ సిటీలు, ఏరోస్పేస్ పార్కులు, సిద్ధంగా ఉన్న పారిశ్రామిక వాతావరణం ఏపీలో ఉందని, భూసేకరణ వంటి సమస్యల గురించి ఆలోచించకుండా ఆవిష్కరణలపై దృష్టి పెట్టవచ్చని ఆయన సూచించారు. పిక్సెల్ టీమ్‌తో సంప్రదింపులు జరపాలని ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్‌ను లోకేశ్ ఆదేశించారు.

లోకేష్ చొరవకు పిక్సెల్ వ్యవస్థాపకుడు క్షితిజ్ సానుకూలంగా స్పందించారు. ఏపీఈడీబీ అధికారులు ఇప్పటికే తమను సంప్రదించారని, అనంతపురం స్పేస్ సిటీలో ఉన్న అవకాశాలను పరిశీలించడానికి తమ బృందం ఉత్సాహంగా ఉందని ఆయన బదులిచ్చారు. బెంగళూరులో మౌలిక వసతులు, ఇతర సమస్యలను ఎదుర్కొంటున్న కంపెనీలను ఏపీకి ఆకర్షించేందుకు లోకేశ్ గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే.

Nara Lokesh
Pixxel Space Tech
Andhra Pradesh IT Minister
Kshitij Khandelwal
Anantapur Space City
AP Economic Development Board

More Telugu News