మేకల తెలివిపై ఆసక్తికర అధ్యయనం.. శాస్త్రవేత్తల ఆశ్చర్యం!
- మనిషి మాట వినిపించిన వైపు ఉన్న ఆహారాన్ని గుర్తిస్తున్న మేకలు
- పరిశోధనలో 60 శాతం మార్లు సరైన ఆహారాన్ని కనిపెట్టిన మేకలు
- ఈ విషయంలో మేకల తెలివి కుక్కలతో సమానంగా ఉందని వెల్లడి
- పెంపకం వల్లే మేకలకు ఈ సామర్థ్యం వచ్చి ఉండొచ్చని అంచనా
ఈ ప్రయోగంలో భాగంగా పరిశోధకులు మొత్తం 29 మేకలపై పరీక్షలు నిర్వహించారు. రెండు ఒకేరకమైన బకెట్లను ఉంచి, ఒకదానిలో మేకలకు ఇష్టమైన పాస్తాను దాచిపెట్టారు. అనంతరం ఆహారం ఉన్న బకెట్ వైపు చూస్తూ ఒక వ్యక్తి ఉత్సాహంగా మాట్లాడారు. ఆ గొంతు వినిపించిన దిశను అనుసరించి మేకలు దాదాపు 60 శాతం సందర్భాల్లో సరైన బకెట్‌ను గుర్తించడం విశేషం.
అయితే, సదరు వ్యక్తి మౌనంగా ఉన్నప్పుడు లేదా ఏ బకెట్ వైపు చూడకుండా మాట్లాడినప్పుడు మేకలు కేవలం 47 నుంచి 49 శాతం మాత్రమే సరైన బకెట్‌ను గుర్తించగలిగాయి. దీనిని బట్టి అవి కేవలం గొంతు వినిపించే దిశను ఆధారంగా చేసుకుని ఆహారాన్ని కనిపెట్టాయని స్పష్టమవుతోంది. ఇటువంటి పరీక్షల్లో కుక్కలు కూడా దాదాపు 63 శాతం విజయం సాధిస్తాయని, ఈ విషయంలో మేకల సామర్థ్యం కుక్కలతో సమానంగా ఉందని పరిశోధకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మానవులతో సుదీర్ఘ కాలం కలిసి జీవించడం, పెంపకం వంటి కారణాల వల్లే మేకలకు ఈ నైపుణ్యం వచ్చి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చింపాంజీల వంటి జంతువుల్లో సైతం ఈ తరహా లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం.
"జంతువులు ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తాయో అర్థం చేసుకోవడం వాటి సంరక్షణకు ఎంతో దోహదపడుతుంది" అని అధ్యయన రచయిత డాక్టర్ స్టువర్ట్ వాట్సన్ వెల్లడించారు. అయితే ఈ సామర్థ్యం పెంపకం వల్లే అలవడిందా లేదా సహజంగానే ఉందా అనే అంశాన్ని నిర్ధారించేందుకు అడవి మేకలపై కూడా పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.