400 ఏళ్లైనా చెక్కు చెదరని చెక్క రాజభవనం.. ఎక్కడుందో తెలుసా?

  • కన్యాకుమారి జిల్లాలో పద్మనాభపురం రాజభవనం
  • 1601లో నిర్మించిన చారిత్రక కట్టడం
  • పూర్తిగా చెక్కతో నిర్మించిన భారతదేశంలోని అతిపెద్ద రాజభవనాల్లో ఒకటి
  • ఒకప్పుడు ట్రావెన్‌కోర్‌ రాజ్యానికి పరిపాలనా కేంద్రం
  • చెక్క శిల్పాలు, మెరిసే నల్లటి నేల, గడియార గోపురం ప్రత్యేక ఆకర్షణలు
భారతదేశంలోని రాజభవనాల గురించి మాట్లాడితే చాలామందికి పాలరాతితో నిర్మించిన భారీ కట్టడాలు, ఎత్తైన రాతి కోటలే గుర్తుకొస్తాయి. అయితే దక్షిణాదిలో మాత్రం వీటికి పూర్తిగా భిన్నమైన ఓ అద్భుత రాజభవనం ఉంది. నాలుగు శతాబ్దాల చరిత్రను మోస్తున్న ఈ కట్టడాన్ని పూర్తిగా చెక్కతో నిర్మించారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఉన్న ఈ రాజభవనం పేరు పద్మనాభపురం ప్యాలెస్‌.

1601లో నిర్మించిన ఈ రాజభవనం ఒకప్పుడు ట్రావెన్‌కోర్‌ రాజ్యానికి పరిపాలనా కేంద్రంగా ఉండేది. 1795లో రాజధానిని తిరువనంతపురానికి మార్చే వరకు ఇక్కడి నుంచే పాలన సాగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ రాజభవనం తమిళనాడులో ఉన్నప్పటికీ ప్రస్తుతం దీని నిర్వహణను కేరళ పురావస్తు శాఖ చూస్తోంది.

ఈ రాజభవనాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది దీని నిర్మాణ శైలి. రాయి, సిమెంట్‌కు బదులుగా చెక్కతో నిర్మించిన ఈ భవనంలో వాలుగా ఉండే పైకప్పులు, అద్భుతమైన చెక్క శిల్పాలు, విశాలమైన ప్రాంగణాలు కనిపిస్తాయి. ఆధునిక ఎయిర్ కండిషనర్లు లేని కాలంలోనే సహజ గాలి ప్రసరణ జరిగేలా దీన్ని రూపొందించారు. అందుకే ఎండాకాలంలోనూ లోపలి గదులు చల్లగా ఉంటాయి.

ఈ రాజభవనంలో అత్యంత ఆసక్తికరమైన అంశాల్లో ఒకటి... నేల! వందల ఏళ్ల క్రితం నిర్మించినప్పటికీ నల్లటి నేల ఇప్పటికీ మెరుస్తూనే ఉంటుంది. బొగ్గు, కాల్చిన కొబ్బరి చిప్పలు, సున్నం, కొన్ని సహజ పదార్థాల మిశ్రమంతో దీనిని తయారు చేశారని చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే కచ్చితమైన రహస్యం మాత్రం ఇప్పటికీ తెలియలేదు.

రాజభవనంలోని ‘తాయి కొట్టారం’ లేదా 'రాజమాత' నివాసం అత్యంత పురాతన భాగంగా గుర్తింపు పొందింది. ఇక్కడ కనిపించే చెక్క శిల్పాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. అలాగే రాజులు కీలక నిర్ణయాలు తీసుకునే ‘మంత్రశాల’ కూడా ప్రత్యేక ఆకర్షణ. ఈ గదిలోని కిటికీలను ఎండ లోపలికి రాకుండా, గాలి మాత్రం సులభంగా ప్రవహించేలా రూపొందించడం అప్పటి శిల్పుల ప్రతిభకు నిదర్శనం.

అంతేకాదు, విశాలమైన భోజనశాల, ప్రాచీన కుడ్యచిత్రాలు, రాజవంశానికి చెందిన వస్తువులు, ఇప్పటికీ పనిచేస్తున్న పురాతన గడియార గోపురం కూడా ఇక్కడి ప్రత్యేకతలు. చరిత్ర, సంస్కృతి, శిల్పకళలపై ఆసక్తి ఉన్నవారికి పద్మనాభపురం రాజభవనం ఓ అరుదైన అనుభూతిని అందిస్తుంది. నాలుగు శతాబ్దాల క్రితం దక్షిణాది రాజుల జీవనశైలిని కళ్లకు కట్టినట్లు చూపించే ఈ చెక్క రాజభవనం నిజంగా ఓ చారిత్రక అద్భుతమే.

Padmanabhapuram Palace
Kanyakumari
Travancore Kingdom
Wooden Palace India
Kerala Tourism
Ancient Indian Architecture

More Telugu News