సాయికృష్ణని చంపేసి.. సాక్ష్యాలు దొరకకుండా అస్థికలను కృష్ణానదిలో కలిపేశారు: కేశినేని నాని
- రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసు
- పోలీసులు చంపేసి, రహస్యంగా దహనం చేశారని మానవ హక్కుల కమిషన్ కు నాని ఫిర్యాదు
- విజయవాడ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని విన్నపం
విజయవాడ రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ మిస్సింగ్ వివాదం.. ఇప్పుడు ‘లాకప్ డెత్’ ఆరోపణలతో జాతీయ స్థాయికి చేరింది. ఈ ఉదంతంపై మాజీ ఎంపీ కేశినేని నాని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
పోలీసుల థర్డ్ డిగ్రీ దెబ్బల వల్ల సాయికృష్ణ ఒంటిపై పడ్డ గాయాలు ఎక్కడ బయటపడతాయో అనే భయంతోనే.. పోలీసులు అతడి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా దహనం చేశారని కేశినేని నాని తన ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఫోరెన్సిక్ పరీక్షలు లేదా డీఎన్ఏ సాక్ష్యాలు కూడా దొరకకుండా ఉండేందుకు.. పక్కా ప్లాన్ ప్రకారం సాయికృష్ణ అస్థికలను కృష్ణానదిలో కలిపేశారంటూ సంచలన విషయాలను మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
విజయవాడలో పోలీసులు ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అనే పదాన్ని పూర్తిగా మరిచిపోయారని... శాంతిభద్రతలను కాపాడాల్సింది పోయి మాఫియాలకు కొమ్ముకాస్తూ ప్రైవేట్ సెటిల్మెంట్ల సిండికేట్గా మారిపోయారని మండిపడ్డారు. ఈ లాకప్ డెత్ వ్యవహారంలో కేశినేని నాని రెండు ప్రధాన లీగల్ డిమాండ్లను ఎన్ హెచ్ఆర్ సీ ముందు ఉంచారు. శాఖాపరమైన పూర్తి బాధ్యత కింద విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబును తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు, సాయికృష్ణ అక్రమ నిర్బంధం, పోలీసుల చేతిలో జరిగిన హత్యపై సెక్షన్ 176(1ఏ) కింద తక్షణమే ఒక స్వతంత్ర జ్యుడీషియల్ విచారణ జరిపించాలని కోరారు.