అతడు బతికి లేడు.. శవాన్ని మాయం చేశారు: సాయికృష్ణ మిస్సింగ్‌పై అంబటి

Ambati Rambabu claims Sai Krishna is no more and his body was disappeared
  • సాయికృష్ణను లాకప్ డెత్ చేశారన్న అంబటి
  • తాము దీనిపై రాజకీయాలు చేయడం లేదని వ్యాఖ్య
  • సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్

ఏపీలో రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై రాజకీయ కలకలం రేగింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో సీఐ నాగరాజుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్‌మీట్ పెట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం మిస్సింగ్ కేసు కాదని, లాకప్ డెత్ చేసి శవాన్ని మాయం చేశారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.


సాయికృష్ణ కోసం పోలీసులు వెతుకుతున్నామని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, అతడు బతికి లేడని అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము దీనిపై ఎలాంటి రాజకీయాలు చేయడం లేదని, కొడుకు కోసం తల్లడిల్లుతున్న ఒక తల్లి ఆవేదనను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నామని చెప్పారు. ప్రభుత్వం ఆదేశించిన సీనియర్ ఐపీఎస్ విచారణపై అంబటి నమ్మకం వ్యక్తం చేయలేదు. "గ్యాంగ్ వార్‌లోనే సాయికృష్ణ ఏమైపోయాడో తెలియకుండా పోయాడు" అని పోలీసులు ముందే రాసుకున్న రిపోర్ట్‌నే విచారణలో కూడా ఇస్తారని ఎద్దేవా చేశారు.


ఒక వ్యక్తిని హత్య చేయడం మొదటి నేరమైతే.. ఆధారాలు దొరకకుండా డెడ్ బాడీని మాయం చేయడం రెండో నేరమని అంబటి దుయ్యబట్టారు. ఈ కృష్ణలంక పీఎస్ ఉదంతంపై పూర్తి నిజాలు బయటకు రావాలంటే తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్‌ను సస్పెండ్ చేసి బాధ్యులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


ఇటు సాయికృష్ణ కుటుంబ సభ్యులు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సీఐ నాగరాజు తన కుమారుడిని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, చంపేస్తామని ముందే బెదిరించారని సాయికృష్ణ తల్లి ఆరోపిస్తోంది. మరోవైపు, సాయికృష్ణను పోలీసులు స్టేషన్‌లోనే లాకప్ డెత్ (పోలీస్ కస్టడీలోనే కొట్టి చంపడం) చేశారని, ఆ తర్వాత లోపాయికారీగా అతడి శవాన్ని కూడా మాయం చేసేశారంటూ సాయికృష్ణ మేనమామ నేరుగా ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది.

Go Back to Shorts
Ambati Rambabu
Sai Krishna missing case
Andhra Pradesh politics
Lockup death allegations
Krishnalanka police station
CBI inquiry demand

More Telugu News