భార్య అక్రమ సంబంధం కేసును గెలిచిన భర్త.. కోర్టు సంచలన తీర్పు
- భార్యాభర్తలు ఇద్దరికీ ఇది రెండో పెళ్లి
- పెళ్లి తర్వాత కూడా వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన భార్య
- అబార్షన్ కూడా చేయించుకుని తనను మోసం చేసిందన్న భర్త
- రూ. 15 లక్షల పరిహారం చెల్లించాలని భార్యను ఆదేశించిన కోర్టు
- పెళ్లి సమయంలో ఇచ్చిన బంగారు ఆభరణాలను కూడా ఇవ్వాలని తీర్పు
సాధారణంగా వైవాహిక వివాదాలు, భార్యాభర్తల కేసుల్లో చట్టాలు, కోర్టు తీర్పులు ఎక్కువగా మహిళలకే అనుకూలంగా ఉంటాయనే భావన సమాజంలో ఉంది. కానీ, భార్య చేసిన మోసాన్ని, ఆమె వల్ల తాను అనుభవించిన మానసిక క్షోభను కోర్టులో ఆధారాలతో సహా నిరూపించి ఒక భర్త చట్టపరంగా విజయం సాధించాడు. కేరళలోని పతనంతిట్ట ఫ్యామిలీ కోర్టు ఈ కేసులో భర్తకు అనుకూలంగా ఒక సంచలన తీర్పును వెలువరించింది.
బాధితుడు కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం... ఇది ఇద్దరికీ రెండో పెళ్లి. అయితే పెళ్లయిన తర్వాత కూడా భార్య మరొక వ్యక్తితో తన వివాహేతర సంబంధాన్ని అలాగే కొనసాగించింది. అంతేకాకుండా, పెళ్లికి ముందే తనకు తెలియకుండా ఆమె ఒకసారి అబార్షన్ చేయించుకుందని... పెళ్లయ్యాక కూడా మరోసారి అబార్షన్ చేయించుకుని తనను తీవ్రంగా మోసం చేసిందని భర్త కోర్టును ఆశ్రయించాడు. ఆమె ప్రవర్తన వల్ల తన వైవాహిక జీవితం నాశనమవ్వడమే కాకుండా, సమాజంలో తమ కుటుంబ పరువు పోయి తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానని 2018 జులైలో పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ పిటిషన్పై సుదీర్ఘ విచారణ జరిపిన పతనంతిట్ట ఫ్యామిలీ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ పెళ్లి బంధం ముక్కలవ్వడానికి కేవలం భార్య మాత్రమే కాకుండా, ఆమెకు సహకరించిన కుటుంబ సభ్యులు, ప్రియుడు కూడా కారణమని కోర్టు తేల్చింది. ఈ మేరకు సదరు భార్యతో పాటు ఆమె తల్లి, సోదరులు, ఆమె ప్రియుడిని కోర్టు దోషులుగా ప్రకటించింది.
బాధితుడికి, అతని కుటుంబానికి కలిగిన పరువు నష్టానికి ప్రతిఫలంగా రూ. 15 లక్షల భారీ పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసు 2018 జులైలో దాఖలైనందున... అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ పరిహారం మొత్తంపై 6 శాతం వడ్డీని కూడా కలిపి చెల్లించాలని స్పష్టం చేసింది. పెళ్లి సమయంలో వరుడి కుటుంబం తరఫున సమర్పించిన 32 గ్రాముల బంగారు ఆభరణాలను కూడా భర్తకు వెంటనే తిరిగి ఇచ్చేయాలని తీర్పునిచ్చింది.