ఆక్వా రైతులను విభజించి సబ్సిడీలు కత్తిరించింది వైసీపీ ప్రభుత్వమే: ఎంఏ షరీఫ్
- ఐదేళ్ల పాలనలో ఆక్వా రంగాన్ని జగన్ నష్టాల్లోకి నెట్టారన్న షరీఫ్
- వైఫల్యాలను కప్పేందుకు ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు
- ఆక్వా జోన్, నాన్-జోన్ తేడా లేకుండా అందరికీ రూ.1.50కే విద్యుత్ అందిస్తామని వెల్లడి
- రైతులపై భారం మోపిన మార్కెట్ సెస్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపణ
వైసీపీ పాలనలో ఫీడ్, సీడ్ ధరలు ఆకాశాన్నంటినా పట్టించుకోని జగన్, ఇప్పుడు ప్రతి అంశానికి కుల రంగు పులుముతున్నారని విమర్శించారు. 'జే-ట్యాక్స్' పేరుతో ఫీడ్, సీడ్, ప్రాసెసింగ్ కంపెనీల నుంచి సుమారు రూ.5,000 కోట్లు అక్రమంగా వసూలు చేశారని, ఆ భారాన్ని రైతులపై మోపారని షరీఫ్ ఆరోపించారు. పాదయాత్రలో యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే ఇస్తామని హామీ ఇచ్చి, ఆక్వా జోన్, నాన్-జోన్ పేర్లతో రైతులను విడదీసి 70 శాతం మందికి సబ్సిడీ దూరం చేసింది గత వైసీపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన విద్యుత్ లేక, కోతలతో రైతులు జనరేటర్లపై ఆధారపడి ఎకరానికి రూ.70 వేల అదనపు భారం మోశారని అన్నారు. అంతేకాకుండా, డిస్కంలకు చెల్లించాల్సిన రూ.1,800 కోట్ల విద్యుత్ సబ్సిడీ బకాయిలను కూడా వదిలేసి వెళ్లారని విమర్శించారు. రొయ్యలకు కిలోకు రూ.240 మద్దతు ధర అని చెప్పి, రూ.210కే కొనుగోలు చేసి రైతులను మోసం చేశారని, 25 పైసలు ఉన్న మార్కెట్ సెస్‌ను రూపాయికి పెంచి రైతులపై మరింత భారం మోపారని దుయ్యబట్టారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆక్వా రైతులకు అండగా నిలిచిందని షరీఫ్ తెలిపారు. జోన్, నాన్-జోన్ తేడా లేకుండా నమోదైన ప్రతి రైతుకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందిస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీ పెంచిన మార్కెట్ సెస్‌ను పూర్తిగా రద్దు చేశామని, విద్యుత్ సబ్సిడీ బడ్జెట్‌ను రూ.800 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు పెంచామని వివరించారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో రూ.88 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ నిర్మిస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆక్వా రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు.