పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు... వరి సాగు తగ్గించండి: తుమ్మల నాగేశ్వరరావు
- ఎల్‌నినో ప్రభావం వల్ల జూన్, జులై నెలల్లో వర్షాలు తగ్గే అవకాశం ఉందన్న తుమ్మల
- వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయడం మంచిదని సూచన
- ఎరువుల గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల జూన్, జులై నెలల్లో వర్షాలు కాస్త తగ్గే సూచనలు ఉన్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగును కాస్త తగ్గించి, మంచి లాభాలనిచ్చే ఆయిల్‌పామ్ వైపు దృష్టి పెట్టాలని రైతులను ఆయన కోరారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలతో ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయడం ప్రస్తుతానికి మంచి నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక ఎరువుల కొరత గురించి రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90.22 లక్షల బస్తాల యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇందులో మార్‌ఫెడ్ వద్ద అత్యధికంగా 59.56 లక్షల బస్తాలు ఉండగా.. రిటైల్ షాపుల్లో 22.67 లక్షలు, సహకార సంఘాల్లో 5.56 లక్షలు, గోడౌన్లలో మరో 3.56 లక్షల బస్తాల స్టాక్ అందుబాటులో ఉందని వెల్లడించారు. సకాలంలో ఎరువులు అందించేందుకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
టెక్నాలజీని వాడుకుంటూ రైతులు సులభంగా ఎరువులు పొందేలా ప్రభుత్వం తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్‌కు కూడా మంచి స్పందన వస్తోందని మంత్రి తెలిపారు. ఇప్పటికే 4.06 లక్షల మంది రైతులు దీని ద్వారా 13.22 లక్షల బస్తాలను బుక్ చేసుకోగా, అందులో 11.18 లక్షల బస్తాలు ఇప్పటికే రైతులకు చేరిపోయాయని చెప్పారు. రైతుల ఫీడ్‌బ్యాక్ ప్రకారం ఈ యాప్‌లో నిరంతరం మార్పులు చేస్తున్నామని, ఒకవేళ స్మార్ట్‌ఫోన్ లేని రైతులు ఉంటే వారి కోసం ప్రత్యేకంగా టోల్-ఫ్రీ నంబర్ ద్వారా బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించామని వెల్లడించారు.