టీషర్ట్‌పై ఆ ఒక్క ముక్క చూసి.. ఇంటర్వ్యూ మొదలవ్వక ముందే అభ్యర్థిని రిజెక్ట్ చేసిన మేనేజర్!

  • టీషర్ట్ స్లోగన్ వల్ల ఇంటర్వ్యూ తిరస్కరణ
  • యువతి ప్రతిభావంతురాలైనా స్లోగన్ కారణంగా ఎదురుదెబ్బ
  • లింక్డిన్‌లోమేనేజర్ పోస్ట్ వైరల్
  • రెండుగా విడిపోయి నెటిజన్ల కామెంట్లు
ముంబైలోని కార్పొరేట్ రంగంలో సరికొత్త చర్చకు దారితీసిన ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రముఖ క్రియేటివ్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వచ్చిన ఒక ప్రతిభావంతురాలైన యువతిని.. ఇంటర్వ్యూ అసలు ప్రారంభం కాకముందే మేనేజర్ తిరస్కరించారు. ఆ యువతి ధరించిన టీషర్ట్‌పై ఉన్న ఒక స్లోగన్.. ఉద్యోగం పట్ల ఆమెకున్న నిర్లక్ష్య వైఖరిని సూచించేలా ఉందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముంబైలోని 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సోషల్, ఎడిటోరియల్ అండ్ బ్రాండ్ లీడ్ భావిషా జైన్.. మూడు నెలల క్రితం జరిగిన ఈ ఆసక్తికరమైన అనుభవాన్ని లింక్డ్‌ఇన్ (LinkedIn) వేదికగా పంచుకోవడంతో ఈ విషయం కాస్తా వైరల్‌గా మారింది.

భావిషా జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. సదరు మహిళా అభ్యర్థి ప్రొఫైల్ చాలా బలంగా ఉంది. ఆమెకు గతంలో పెద్ద బ్రాండ్లలో పనిచేసిన అనుభవంతో పాటు సోషల్ మీడియాలో 50 వేల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. అయితే, ఇంటర్వ్యూ సమయంలో ఆమె ధరించిన టీషర్ట్‌పై “I’m too hot for a job” (ఉద్యోగం చేయడానికి నేను చాలా హాట్‌గా ఉన్నాను) అని రాసి ఉంది. ఇది చూసిన వెంటనే భావిషా జైన్.. ఆమెతో మాట్లాడటం కూడా వృథా అని భావించి ఇంటర్వ్యూని రద్దు చేశారు. ఇంటర్వ్యూలకు వచ్చేటప్పుడు మొదటి ఇంప్రెషన్, ప్రొఫెషనల్ బాడీ లాంగ్వేజ్ అత్యంత కీలకమని, ఆ టీషర్ట్ స్లోగన్ ఉద్యోగంపై ఆమెకు గౌరవం లేదనే తప్పుడు సంకేతాన్ని పంపిందని భావిషా స్పష్టం చేశారు.

దీనికి ఉదాహరణగా.. "మనం పెళ్లిళ్లకు స్విమ్‌సూట్ (ఈత దుస్తులు) వేసుకెళ్లం, అలాగే జిమ్‌కి ఫార్మల్ దుస్తులు వేసుకెళ్లం. సందర్భాన్ని బట్టి బట్టలు వేసుకోవడం కనీస బాధ్యత" అని భావిషా పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. మేనేజర్ నిర్ణయాన్ని సమర్థిస్తున్న కొందరు.. ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కనీస ప్రొఫెషనల్ నిబంధనలు పాటించాల్సిందేనని చెప్తున్నారు. అయితే క్రియేటివ్ రంగానికి చెందిన ఉద్యోగాల్లో టాలెంట్, వ్యక్తిత్వం ముఖ్యమని, కేవలం ఒక టీషర్ట్ స్లోగన్‌ను జోక్‌గా తీసుకోకుండా అంత కఠినంగా రిజెక్ట్ చేయడం ముమ్మాటికీ తప్పేనని మరికొందరు విమర్శిస్తున్నారు.

Bhavisha Jain
Amazon Prime Video
Job Interview Rejection
Professional Dress Code
LinkedIn Viral Story
Mumbai Corporate Culture

More Telugu News