చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. మాంసం నింపిన బొమ్మలతో కొత్త ఎత్తుగడ!
- కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కొనసాగుతున్న గాలింపు
- వన్యమృగాల కదలికల కోసం మాంసం నింపిన బొమ్మలు ఏర్పాటు చేసిన అధికారులు
- పాపతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి
- రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.. డ్రోన్లతో జల్లెడ
- ఆచూకీ చెప్పిన వారికి రూ. లక్ష రివార్డు ప్రకటన
చిన్నారిని ఏదైనా వన్యమృగం ఎత్తుకెళ్లి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నప్పటికీ, దానికి సంబంధించిన ఆధారాలేవీ ఇప్పటివరకు లభించలేదు. సుమారు 400 మందికి పైగా పోలీసు, అటవీ శాఖ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) కూడా రంగంలోకి దిగింది. థర్మల్ డ్రోన్లతో సైతం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.
ఈ కేసులో మిస్టరీని మరింత పెంచుతూ, పాపతో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్క జూన్ 13న మృతి చెందింది. జూన్ 9న ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చిన ఈ కుక్క, అప్పటి నుంచి ఆహారం తీసుకోకుండా వింతగా ప్రవర్తించింది. దీనికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సుమారు 80 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఇంటికి చేరిన ఈ కుక్క, వైరల్ ఇన్ఫెక్షన్ సోకి మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు.
జూన్ 6న తుని మండలం సిహెచ్. అగ్రహారంలో తల్లిదండ్రులు గణేష్, భవానితో కలిసి పామాయిల్ తోటకు వెళ్లిన జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. తల్లిదండ్రుల మధ్య సమన్వయ లోపం కారణంగానే పాప తప్పిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. పాప ఆచూకీ తెలిపిన వారికి జిల్లా యంత్రాంగం రూ.లక్ష రివార్డును ప్రకటించింది.