48 ఏళ్ల తర్వాత ఒక్కటైన వృద్ధ దంపతులు.. చేతిపై పచ్చబొట్టే వారిని కలిపింది.. సినిమాను తలపించే రియల్ స్టోరీ!

Elderly couple reunited after 48 years tattoo on hand helped them meet real story like a movie
  • పెళ్ల‌యిన కొంతకాలానికే దూరమై 48 ఏళ్ల తర్వాత తిరిగి కలిసిన దంపతులు
  • కుటుంబ కలహాలతో విడిపోయి నాగ్పూర్లో స్థిరపడిన భార్య నిర్మలాదేవి
  • చేతిపై ఉన్న పచ్చబొట్టు గుర్తుతో భార్యను గుర్తించిన భర్త లాలన్ మిశ్రా
  • వృద్ధాప్యంలో తిరిగి ఒక్కటైన జంట.. గ్రామస్థుల హర్షం
దాదాపు అర్ధ శతాబ్దం క్రితం విడిపోయిన భార్యాభర్తలు మళ్లీ ఒక్కటయ్యారు. 48 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భర్తను వెతుక్కుంటూ వచ్చిన భార్యను, ఆమె చేతిపై ఉన్న పాత పచ్చబొట్టు గుర్తుతో గుర్తించి ఆనందభాష్పాలతో స్వాగతించాడు. బీహార్‌లోని బరియార్‌పూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ అపురూప కలయిక.. ప్రేమ, సహనం, బంధాల విలువను చాటిచెప్పింది. ఈ వృద్ధ దంపతుల పునఃకలయికను చూసి గ్రామస్థులంతా ఆశ్చర్యంతో పాటు భావోద్వేగానికి గురయ్యారు.

వివరాల్లోకి వెళితే.. బరియార్‌పూర్ గ్రామానికి చెందిన లాలన్ మిశ్రా, నిర్మలా దేవికి 1977 మార్చిలో వివాహమైంది. పెళ్లయిన మొదటి ఆరు నెలలు వారి జీవితం సంతోషంగానే సాగింది. అయితే, ఆ తర్వాత కుటుంబంలో తలెత్తిన కొన్ని విభేదాలు, అపార్థాల కారణంగా నిర్మలా దేవి తన భర్త ఇంటిని విడిచి పుట్టింటికి వెళ్లిపోయారు. "కుటుంబంలోని కొందరు సభ్యులు నా భర్తకు వ్యతిరేకంగా నన్ను ప్రభావితం చేశారు. అదే నేను ఇల్లు విడిచి వెళ్లడానికి కారణమైంది" అని నిర్మలా దేవి గుర్తుచేసుకున్నారు.

పుట్టింటికి వెళ్లిన తర్వాత కొన్నాళ్లకు ఆమె తండ్రి నాగ్ పూర్ లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం ఇప్పించడంతో, తన ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి నాగ్ పూర్ లోనే నివసిస్తూ ఇద్దరు కుమారులను పెంచి పెద్దచేశారు. వారిలో ఒకరు ప్రస్తుతం పుణేలో ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, మరొకరు చదువుకుంటున్నారు. ఈ మధ్య కాలంలోనే నిర్మలా దేవి తల్లిదండ్రులు కూడా మరణించారు.

మరోవైపు భార్య వెళ్లిపోయిన తర్వాత లాలన్ మిశ్రా ఆమె కోసం చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతగానో వెతికారు. ఈ క్రమంలో ఆయన తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయారు. అయినా ఆమె ఆచూకీ మాత్రం దొరకలేదు. దశాబ్దాలు గడిచిపోయాయి.

ఇటీవల, నిర్మలా దేవి తన భర్తను కలుసుకోవాలనే ఉద్దేశంతో తిరిగి బరియార్‌పూర్‌కు వచ్చారు. ముందుగా ఆమె భక్తియార్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త లాలన్ మిశ్రా గురించి ఆరా తీశారు. పోలీసుల సహాయంతో తన మెట్టినింటికి చేరుకున్నారు. మొదట ఒక వృద్ధురాలు వచ్చి తనను తాను కుటుంబ సభ్యురాలిగా పరిచయం చేసుకోవడంతో ఇంట్లో వాళ్లు గందరగోళానికి గురయ్యారు. ఆ సమయంలో నిర్మలా దేవి తన ఎడమ చేతిపై ఉన్న పాత 'గోద్నా' (పచ్చబొట్టు)ను లాలన్ మిశ్రాకు చూపించారు. ఆ గుర్తును చూడగానే ఆయన వెంటనే తన భార్యను గుర్తించారు.

48 ఏళ్ల తర్వాత కళ్లెదుట భార్యను చూసి లాలన్ మిశ్రా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. "ఆమె తన ఇష్టప్రకారమే ఇంటి నుంచి వెళ్లిపోయింది. 48 ఏళ్ల తర్వాత ఇప్పుడు తిరిగొచ్చింది. ఇంతకాలం ఆమె తన పుట్టింట్లో, ఆ తర్వాత నాగ్ పూర్ లో ఉందని తెలిసింది. మాకు ఇద్దరు పిల్లలున్నారు" అని మిశ్రా తెలిపారు. ఆయన తన భార్యను గుర్తించిన వెంటనే కుటుంబమంతా సంతోషంలో మునిగిపోయింది. అందరూ నిర్మలా దేవిని కన్నీళ్లతో ఆలింగనం చేసుకున్నారు. "నన్ను ఆయన అంగీకరించడం, అంగీకరించకపోవడం ఆయన ఇష్టం. నేను మాత్రం 48 ఏళ్లు ఆయనకు దూరంగా ఉండి నా ఇద్దరు కొడుకులను పెంచాను" అని నిర్మల అన్నారు. జీవిత చరమాంకంలో లాలన్ మిశ్రా దశాబ్దాల ఒంటరితనానికి తెరపడింది. కొన్ని బంధాలు ఎంతకాలమైనా చెక్కుచెదరవని ఈ సంఘటన నిరూపించింది.
Go Back to Shorts
Lalan Mishra
Nirmala Devi
Bihar elderly couple reunion
Tattoo recognition story
Reunited after 48 years
Bariyarpur Bihar news

More Telugu News