భారత్ చాలా ముందుంది.. డిజిటల్ చెల్లింపులకు విదేశీ అమ్మాయి ఫిదా!
- భారత్ చెల్లింపు వ్యవస్థపై స్లోవేనియా యువతి ప్రశంసలు
- చిన్న టీ దుకాణాల్లోనూ యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి
- చాలా దేశాల కంటే భారత్ డిజిటల్ చెల్లింపుల్లో ముందుందని వ్యాఖ్య
- యూపీఐ ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన వ్యవస్థని అభిప్రాయం
గ్యాప్ ఇయర్‌లో భాగంగా భారత్‌ను సందర్శించిన ఆమె.. ఇక్కడ దాదాపు నగదు అవసరమే రాలేదని చెప్పారు. ‘‘చిన్న టీ దుకాణం నుంచి స్థానిక రెస్టారెంట్, రోడ్డుపక్కన ఉన్న చిన్న షాపు వరకు ఎక్కడికి వెళ్లినా క్యూఆర్ కోడ్ చూపించారు. నగదు ఇవ్వాల్సిన పరిస్థితి చాలా అరుదుగా ఎదురైంది’’ అని పేర్కొన్నారు.
యూపీఐని ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన చెల్లింపు వ్యవస్థల్లో ఒకటిగా జూలియా అభివర్ణించారు. బ్యాంకు అవసరం లేకుండా కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే క్షణాల్లో డబ్బు బదిలీ అవుతుండటం తనను ఆకట్టుకుందని చెప్పారు. అయితే చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాలకు వెళ్లే వారు భద్రత కోసం కొంత నగదు లేదా డెబిట్, క్రెడిట్ కార్డులను వెంట ఉంచుకోవడం మంచిదని సూచించారు.
జూలియా చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు భారత డిజిటల్ చెల్లింపు వ్యవస్థను ప్రశంసిస్తూ స్పందించారు. కొందరు యూపీఐని ఇంటర్నెట్ లేకుండానే వినియోగించవచ్చని గుర్తుచేశారు. కాగా, 2016లో ప్రారంభమైన యూపీఐ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థగా ఆదరణ పొందింది. రోజువారీ లావాదేవీల్లో కోట్లాది మంది భారతీయులు దీనిని వినియోగిస్తున్నారు.