ఐఫోన్ ప్రియులకు షాక్.. యాపిల్ వ్యూహం మార్పు.. ఐఫోన్ 18 కోసం 2027 వరకు ఆగాల్సిందే!

  • దశాబ్దాల లాంచ్ వ్యూహాన్ని మార్చనున్న యాపిల్
  • 2026లో ప్రో, ఫోల్డబుల్.. 2027లో సాధారణ ఐఫోన్ 18 విడుదల
  • యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ధర సుమారు 2 వేల డాల‌ర్లుగా అంచనా
  • ఏ20 చిప్, 12జీబీ ర్యామ్‌తో రానున్న ఐఫోన్ 18
  • ప్రొడక్షన్ ఖర్చు తగ్గించేందుకు యాపిల్ ప్రయత్నాలు
టెక్ దిగ్గజం యాపిల్, తన ఐఫోన్ విడుదల వ్యూహంలో దశాబ్ద కాలంలోనే అతిపెద్ద మార్పుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఐఫోన్ 18 సిరీస్‌ను ఒకేసారి కాకుండా రెండు వేర్వేరు సమయాల్లో విడుదల చేసేందుకు యాపిల్ ప్రణాళిక రచిస్తోంది. దీని ప్రకారం హై-ఎండ్ ప్రో మోడల్స్‌ను 2026 చివర్లో విడుదల చేసి, సాధారణ ఐఫోన్ 18 మోడల్‌ కోసం వినియోగదారులు 2027 ప్రథమార్ధం వరకు వేచి చూడాల్సి రావచ్చు.

ఈ ఊహాగానాలకు యాపిల్ ఐఫోన్లకు కెమెరా లెన్సులు సరఫరా చేసే ప్రముఖ సంస్థ 'లార్గాన్ ప్రెసిషన్' చేసిన వ్యాఖ్యలు బలాన్నిస్తున్నాయి. ఇటీవల జరిగిన వాటాదారుల సమావేశంలో ఆ సంస్థ ఛైర్మన్ లిన్ ఎన్-పింగ్ మాట్లాడుతూ.. తమకు చెందిన ఒక 'ప్రధాన అమెరికన్ కస్టమర్' తన కొత్త ఉత్పత్తి విడుదలను 2027 మొదటి త్రైమాసికానికి మార్చినట్లు వెల్లడించారు. ఆయన యాపిల్ పేరును గానీ, ఉత్పత్తి పేరును గానీ ప్రస్తావించనప్పటికీ, ఈ సమయం ఐఫోన్ 18 విడుదలపై వస్తున్న వదంతులతో సరిపోలుతుండటంతో టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కొత్త వ్యూహం ఇదేనా?
నివేదికల ప్రకారం యాపిల్ తన లాంచ్ షెడ్యూల్‌ను రెండు భాగాలుగా విభజించనుంది. 2026 సెప్టెంబర్‌లో జరిగే ఈవెంట్‌లో కేవలం ప్రీమియం మోడల్స్‌ అయిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌తో పాటు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. ఆ తర్వాత కొన్ని నెలల విరామం ఇచ్చి, 2027 వసంతకాలంలో (స్ప్రింగ్) సాధారణ ఐఫోన్ 18, ఐఫోన్ 18e, ఐఫోన్ ఎయిర్ వారసుడిగా రాబోయే మరో మోడల్‌ను పరిచయం చేయాలని యోచిస్తోంది.

ఒకే లాంచ్ ఈవెంట్‌పై ఉండే ఒత్తిడిని తగ్గించి, ఏడాది పొడవునా డిమాండ్‌ను కొనసాగించేందుకే యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఫోల్డబుల్ ఫోన్ వంటి కొత్త ఉత్పత్తులను చేర్చడం వల్ల సంక్లిష్టంగా మారిన ఉత్పత్తి ప్రణాళికను సులభతరం చేసుకోవడం కూడా దీని వెనుక మరో కారణం కావచ్చు.

ఐఫోన్ 18, ఫోల్డబుల్ ఫోన్ ప్రత్యేకతలు
2026లో రానున్న యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్, పుస్తకంలా మడిచే డిజైన్‌తో వస్తుందని అంచనా. దీనికి బయట ఒక చిన్న డిస్‌ప్లే, లోపల పెద్ద స్క్రీన్ ఉంటాయని సమాచారం. దీని ధర సుమారు 2వేల డాల‌ర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 1.89 లక్షలు) ఉండొచ్చని అంచనా.

ఇక, 2027లో విడుదలయ్యే సాధారణ ఐఫోన్ 18 డిజైన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే, హార్డ్‌వేర్ పరంగా భారీ అప్‌గ్రేడ్‌లు ఉండనున్నాయి. మెరుగైన పనితీరు, విద్యుత్ సామర్థ్యం కోసం 2-నానోమీటర్ టెక్నాలజీతో తయారు చేసిన కొత్తతరం ఏ20 ప్రాసెసర్, 12జీబీ వరకు ర్యామ్, అధిక రిజల్యూషన్ ఫ్రంట్ కెమెరా, ప్రకాశవంతమైన డిస్‌ప్లే వంటివి ఇందులో ఉండనున్నాయి. ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రణలో ఉంచేందుకు యాపిల్ ప్రయత్నిస్తున్నందున, ధరలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ నివేదికలపై యాపిల్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Apple
iPhone 18 release date
Foldable iPhone launch
Apple product strategy
iPhone 18 Pro Max
iPhone 18 specifications

More Telugu News