ఏఐ ఎఫెక్ట్.. త్వరలో స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు పెరగనున్నాయా?
- ఏఐతో మెమరీ చిప్‌లకు డిమాండ్
- ఏఐ మోడళ్లు, డేటా సెంటర్ల కోసం అధిక సామర్థ్య చిప్‌లు అవసరం
- రానున్న కొన్నేళ్లలో డిమాండ్-సరఫరా మధ్య అంతరం
- భారత్‌పై గణనీయ ప్రభావం
- ప్రత్యామ్నాయ మార్గాలపై కంపెనీల దృష్టి
- తక్షణం ప్రభావం ఉండకపోవచ్చని అంచనా
ఏఐ మోడళ్లు, డేటా సెంటర్ల కోసం అధిక సామర్థ్యం గల మెమరీ చిప్‌లు అవసరం అవుతున్నాయి. దీంతో తయారీ సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రధానంగా ఏఐ రంగం వైపు మళ్లిస్తున్నాయి. ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ల వంటి వినియోగదారుల ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే మెమరీ చిప్‌ల సరఫరా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పెద్దగా ప్రభావం కనిపించకపోయినా రానున్న కొన్నేళ్లలో డిమాండ్-సరఫరా మధ్య అంతరం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
భారత్‌పై ఈ ప్రభావం గణనీయంగా ఉండనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ 2030 నాటికి 120 బిలియన్ డాలర్లను దాటే అవకాశముంది. ముఖ్యంగా రెండు, మూడో శ్రేణి నగరాల్లో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. అయితే మెమరీ చిప్‌ల ధరలు పెరిగితే కంపెనీలు ఉత్పత్తుల కాన్ఫిగరేషన్లను మార్చడం, ఆఫర్లను తగ్గించడం లేదా ధరలను పెంచడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
పరిస్థితిని ఎదుర్కొనేందుకు కంపెనీలు ప్రత్యామ్నాయ సరఫరాదారులను వెతకడం, నిల్వలను పెంచడం, స్థానిక తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడం వంటి చర్యలు చేపడుతున్నాయి. అందువల్ల ఇప్పటికిప్పుడు వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా రానున్న కాలంలో గ్యాడ్జెట్ల ధరలపై ఏఐ ప్రభావం కనిపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.