ఎవరెస్ట్‌పై 30 ఏళ్ల మిస్టరీకి తెర?.. ‘గ్రీన్‌ బూట్స్‌’ మృతదేహం కోసం ప్రత్యేక మిషన్‌

Mount Everest mystery to end as ITBP plans mission to recover Green Boots body
  • డెత్‌ జోన్‌లో 30 ఏళ్లుగా పడి ఉన్న మృతదేహం
  • తిరిగి తీసుకొచ్చేందుకు ఐటీబీపీ ప్రత్యేక ఆపరేషన్‌
  • జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య మిషన్‌
  • ఆ మృతదేహం ఎవరిదన్నది ఇప్పటికీ మిస్టరీనే
  • 1996లో ముగ్గురు పర్వతారోహకుల మృతి
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ఎవరెస్ట్‌ పర్వతంలోని ‘డెత్‌ జోన్‌’ ఒకటి. ఇక్కడ 30 ఏళ్లుగా పడి ఉన్న ఓ భారతీయ పర్వతారోహకుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) ప్రత్యేక మిషన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ‘గ్రీన్‌ బూట్స్‌’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆ మృతదేహం మూడు దశాబ్దాలుగా ఎవరెస్ట్‌పై పర్వతారోహకులకు ఓ విషాద గుర్తుగా నిలిచింది.

ఈ ఆపరేషన్‌ కోసం నిపుణులైన హై ఆల్టిట్యూడ్‌ రికవరీ ఏజెన్సీని నియమించేందుకు ఐటీబీపీ టెండర్‌ జారీ చేసింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య ఈ మిషన్‌ను చేపట్టే అవకాశముంది. 8,000 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న డెత్‌ జోన్‌లోకి ప్రవేశించి మృతదేహాన్ని కిందకు తీసుకురావడం, అనంతరం నేపాల్‌ మార్గంగా భారత్‌కు తరలించడం ఈ మిషన్‌లో భాగం.

ఈ ఆపరేషన్‌లో కనీసం ఆరుగురు అనుభవజ్ఞులైన షెర్పాలను రంగంలోకి దించే అవకాశం ఉంది. టిబెట్‌లోని చైనా అధికారుల అనుమతులు పొందడం, సరిహద్దు దాటించడం, చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేయడం, దశాబ్దాలుగా మంచులో గడ్డకట్టిన మృతదేహాన్ని గౌరవప్రదంగా భద్రపరచడం వంటి బాధ్యతలు కూడా రికవరీ బృందానికే ఉంటాయి.

‘గ్రీన్‌ బూట్స్‌’గా ప్రసిద్ధి చెందిన ఈ మృతదేహం అసలు ఎవరిదన్నది ఇప్పటికీ పూర్తిగా నిర్ధారణ కాలేదు. 1996లో ఎవరెస్ట్‌ను అధిరోహించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఐటీబీపీ బృందంలోని లాన్స్‌ నాయక్‌ దోర్జే మోరుప్‌ లేదా హెడ్‌ కానిస్టేబుల్‌ త్సేవాంగ్‌ పాల్జోర్‌దేనని భావిస్తున్నారు. ఆ ఏడాది జరిగిన విషాద ఘటనలో ముగ్గురు భారతీయ పర్వతారోహకులు మరణించగా వారిలో ఒకరి మృతదేహమే ‘గ్రీన్‌ బూట్స్‌’గా గుర్తింపు పొందింది.
Go Back to Shorts
Green Boots
ITBP
Mount Everest
Death Zone
Tsewang Paljor
Everest body recovery mission

More Telugu News