డీజిల్‌, విమాన ఇంధన ఎగుమతులపై అదనపు సుంకం పెంపు

Central Government increases additional duty on diesel and aviation fuel exports
  • డీజిల్‌పై సుంకం రూ.14కు పెంపు
  • ఏటీఎఫ్‌పై రూ.12.50కు పెరిగిన ట్యాక్స్‌
  • పెట్రోల్‌ ఎగుమతి సుంకంలో మార్పు లేదు
  • దేశీయ పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ప్రభావం ఉండదని స్పష్టీకరణ
పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని (విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌) పెంచింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయ ఇంధన నిల్వలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడంతో పాటు, ఎగుమతుల ద్వారా లభిస్తున్న అదనపు లాభాలపై నియంత్రణ సాధించడమే లక్ష్యంగా ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం డీజిల్‌ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని లీటరుకు రూ.13.50 నుంచి రూ.14కు పెంచారు. అలాగే విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ఎగుమతులపై సుంకాన్ని రూ.9.50 నుంచి రూ.12.50కు పెంచారు. అయితే పెట్రోల్‌ ఎగుమతులపై ప్రస్తుతం అమల్లో ఉన్న లీటరుకు రూ.1.50 సుంకంలో ఎలాంటి మార్పు చేయలేదు. కొత్త రేట్లు జూన్‌ 16 నుంచి అమల్లోకి రానున్నాయి.

అయితే ఈ నిర్ణయం దేశీయ వినియోగదారులపై తక్షణ ప్రభావం చూపదని కేంద్రం స్పష్టం చేసింది. దేశీయ మార్కెట్‌కు సరఫరా చేసే పెట్రోల్‌, డీజిల్‌పై ఉన్న ఎక్సైజ్‌ సుంకాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపింది. దీంతో పెట్రోల్‌ బంకుల్లో ఇంధన ధరలు వెంటనే పెరిగే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు.

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఘర్షణల నేపథ్యంలో మార్చి 26న కేంద్రం విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను తిరిగి అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి అంతర్జాతీయ ముడిచమురు ధరలు, రిఫైనరీల లాభాల పరిస్థితిని బట్టి ప్రతి రెండు వారాలకు ఒకసారి సుంకాలను సమీక్షిస్తోంది. దేశీయ అవసరాలకు సరిపడా ఇంధనం అందుబాటులో ఉండేలా చూసేందుకు, అధిక లాభాల కోసం ఎగుమతులు పెరగకుండా నియంత్రించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని కేంద్రం చెబుతోంది.
Go Back to Shorts
Windfall Tax
Diesel Export Duty
Aviation Turbine Fuel
Central Government
Fuel Export Tax Hike
Oil Price Volatility

More Telugu News