చక్కెర పూర్తిగా మానేస్తే ప్రమాదమా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది

  • పూర్తిగా మానేయడంపై పరిశోధనల్లో సందేహాలు
  • పేగుల ఆరోగ్యంపై ప్రభావం
  • ఇన్సులిన్‌ నిరోధకత పెరిగినట్లు గుర్తింపు
  • అధిక చక్కెర మాత్రం హానికరమే
  • బ్యాలెన్స్‌డ్‌ ఉత్తమమంటున్న నిపుణులు
బరువు తగ్గాలన్నా, షుగర్‌ను అదుపులో పెట్టాలన్నా చాలా మంది ముందుగా చేసే పని చక్కెరను తగ్గించడం. కొందరైతే పూర్తిగా మానేయడానికే ప్రయత్నిస్తారు. చక్కెర ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే చక్కెరను పూర్తిగా ఆహారం నుంచి తొలగించడం వల్ల కూడా కొన్ని అనుకోని సమస్యలు రావొచ్చని తాజా అధ్యయనం చెబుతోంది. అమెరికాలో జరిగిన ఎండో 2026 సదస్సులో వెల్లడైన ఈ పరిశోధన ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారితీసింది.

చక్కెర లేకపోతే ఏమైంది?
పరిశోధకులు ఎలుకలను రెండు గ్రూపులుగా విభజించి 16 వారాల పాటు అధ్యయనం చేశారు. ఒక గ్రూపునకు చక్కెర ఉన్న తక్కువ కొవ్వు ఆహారం ఇవ్వగా మరో గ్రూపునకు చక్కెర లేని అదే తరహా ఆహారం అందించారు. తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు, ఇన్సులిన్‌ పనితీరు, పేగుల్లోని సూక్ష్మజీవులు, కాలేయ ఆరోగ్యం వంటి అంశాలను పరిశీలించారు. ఆశ్చర్యకరంగా, చక్కెర పూర్తిగా మానేసిన ఎలుకల్లో బరువు పెద్దగా తగ్గలేదు. పైగా రక్తంలో చక్కెర నియంత్రణ దెబ్బతినడం, ఇన్సులిన్‌ నిరోధకత పెరగడం, పేగుల ఆరోగ్యం బలహీనపడడం, కాలేయంలో వాపు వంటి సమస్యలు కనిపించాయి. దీంతో చక్కెరను పూర్తిగా తొలగించడం సరైన నిర్ణయం కాకపోవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

పేగుల ఆరోగ్యంతో సంబంధం ఏంటి?
మన పేగుల్లో లక్షల కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవే జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు అనేక పనుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సూక్ష్మజీవుల బ్యాలెన్స్‌ దెబ్బతింటే ఊబకాయం, మధుమేహం, కాలేయ సమస్యల వంటి అనారోగ్య పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంటుంది. చక్కెరను పూర్తిగా మానేసిన ఎలుకల్లో ఈ సమతుల్యతలో మార్పులు కనిపించినట్లు అధ్యయనం వెల్లడించింది.

అంటే చక్కెర ఎక్కువగా తినాలా?
అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల ఊబకాయం, టైప్‌-2 డయాబెటిస్‌, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ అధ్యయనం చెప్పేది ఒక్కటే. చక్కెరను అధికంగా తీసుకోవడం హానికరం. అలాగే పూర్తిగా మానేయడం కూడా కొన్ని సందర్భాల్లో ప్రతికూల ప్రభావాలు చూపవచ్చు. అందుకే బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ ఉత్తమమని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ అధ్యయనం ఎలుకలపై మాత్రమే జరిగింది. మనుషులపై మరింత లోతైన పరిశోధనలు జరగాల్సి ఉంది.

Sugar
Health study
Weight loss
Insulin resistance
Gut health
Endo 2026

More Telugu News