ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్-రష్మిక.. విద్యార్థులకు అండగా కొత్త దంపతులు
- విజయ్ దేవరకొండ, రష్మిక దంపతుల గొప్ప మనసు
- ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ, రష్మిక
- విజయ్ తండ్రి స్వగ్రామమైన సొంత గ్రామమైన తుమ్మన్‌పేటలో విద్యా సహాయం
- దేవరకొండ ఫౌండేషన్ ద్వారా 44 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేయూత
ఈ మేరకు విజయ్ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. "మా నాన్న పుట్టిన చిన్న పల్లె తుమ్మనపేటకు బయలుదేరాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో నేను, రష్మిక మా ఒక చిన్న కలను ప్రకటించాం. అచ్చంపేట మండలంలోని 9, 10 తరగతుల విద్యార్థులను ప్రోత్సహించాలన్నదే మా లక్ష్యం" అని పేర్కొన్నారు. విజయ్ పోస్ట్‌ను రష్మిక రీషేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉదయ్‌పూర్‌లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట, 'దేవరకొండ ఫౌండేషన్' ద్వారా తుమ్మనపేటలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదివే విద్యార్థులకు విద్యా సహాయం అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ఫీజులు చెల్లించడం, వారికి అవసరమైన నోట్‌బుక్స్, ఇతర స్టడీ మెటీరియల్‌ను అందించనున్నారు. తద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు ఆర్థిక కారణాలతో చదువు మధ్యలో ఆగిపోకుండా చూడాలన్నది వీరి సంకల్పం.
ఇక సినిమాల విషయానికొస్తే, వివాహం తర్వాత విజయ్, రష్మిక తొలిసారిగా 'రణబాలి' అనే పీరియడ్ డ్రామా చిత్రంలో కలిసి నటిస్తున్నారు. గతంలో 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ జంటకు, 'రణబాలి' మూడో చిత్రం కానుంది. 1850ల నాటి చారిత్రక వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. చరిత్ర పుస్తకాల్లో నమోదుకాని, బ్రిటిష్ వారు తప్పుగా ప్రచారం చేసిన కొన్ని కీలక సంఘటనల ఆధారంగా ఈ చిత్రం కథ సాగుతుందని సమాచారం.