అమరావతి పనులు ఆగలేదు.. జోరుగా సాగుతున్నాయి: మంత్రి లోకేశ్
- అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయన్న మంత్రి
- పనులపై జరుగుతున్న విష ప్రచారాన్ని ఆపాలని హితవు
- వర్షం వస్తే పనులు ఆగిపోతాయన్న వార్తలను ఖండించిన లోకేశ్
- పనుల పురోగతిని చూపిస్తూ 'ఎక్స్' వేదికగా వీడియో విడుదల
"అమరావతిలో పనులు ఏమాత్రం ఆగడం లేదు. వర్షం కురిస్తే మునిగిపోయిందంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. రాజధానిలో ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు, ప్రధాన రహదారులు, రిజర్వాయర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న టవర్లు, మంత్రుల బంగ్లాల నిర్మాణాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇకనైనా విష ప్రచారాన్ని ఆపండి" అని చెప్పిన ఓ వీడియోను మంత్రి లోకేశ్ 'ఎక్స్' ద్వారా పంచుకున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను వీడియో రూపంలో ప్రజల ముందు ఉంచి, అమరావతిపై జరుగుతున్న దుష్ప్రచారానికి మంత్రి లోకేశ్ గట్టిగా బదులిచ్చారు.