సుకుమారిని టచ్ చేస్తే షాక్.. 'ఓ సుకుమారి!' ఫన్నీ టీజర్ వచ్చేసింది!

Oh Sukumari teaser features a hilarious electric shock concept
  • తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా 'ఓ సుకుమారి!'
  • వినోదభరితంగా సాగిన సినిమా టీజర్ విడుదల
  • పెళ్లికూతురిని తాకితే షాక్ కొట్టే వినూత్న కథాంశం
  • దర్శకుడిగా పరిచయమవుతున్న భరత్ దర్శన్
  • గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాణం
విలక్షణ నటుడు తిరువీర్, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రం 'ఓ సుకుమారి!'. భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా వినోదభరితమైన టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

టీజర్‌ను గమనిస్తే.. తనకు సుకుమారంగా, సున్నితంగా ఉండే అమ్మాయి భార్యగా కావాలని హీరో (తిరువీర్) తన కుటుంబసభ్యులను కోరతాడు. "చూడగానే ఒళ్లు జలదరించాలి" అంటూ తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో వివరిస్తాడు. అతని అంచనాలకు తగ్గట్టే ఓ అమ్మాయిని (ఐశ్వర్య రాజేశ్) చూసి పెళ్లి ఫిక్స్ చేస్తారు. అయితే, పెళ్లి పీటల మీద అనుకోకుండా పెళ్లికూతురి భుజం తగలగానే పెళ్లికొడుకుకు తేలికపాటి ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది. ఈ వినూత్నమైన కాన్సెప్ట్‌తో టీజర్‌ను కట్ చేసి సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు.

'మసూద', 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం' బ్లాక్‌బస్టర్‌తో మెప్పించిన ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'శివం భజే' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఈ బ్యానర్ నుంచి వస్తున్న రెండో సినిమా ఇది.

ఈ చిత్రానికి కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం అందిస్తుండగా, 'రాజకార్', 'పొలిమేర' ఫేమ్ సీహెచ్ కుషేందర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. 'బలగం' ఫేమ్ తిరుమల ఎం. తిరుపతి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Go Back to Shorts
Oh Sukumari
Thiruveer
Aishwarya Rajesh
Teaser
Bharat Darshan
Ganga Entertainments
Telugu Cinema News

More Telugu News