మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై గూగుల్ కన్ను.. డేటా సెంటర్ల కోసం వినియోగించే ప్లాన్!
- పాత ఫోన్లను మళ్లీ వినియోగించాలనుకుంటున్న గూగుల్
- 2,000 ఫోన్లతో క్లస్టర్ ప్రణాళిక
- ప్రాసెసర్, మెమరీని ఉపయోగించనున్న పరిశోధకులు
- ఎలక్ట్రానిక్ వ్యర్థాలు తగ్గించే ప్రయత్నం
- విద్యా, పరిశోధన రంగాలకు ఉపయోగం
సాధారణంగా పాత ఫోన్లలో ఉండే ప్రాసెసర్, మెమరీ, స్టోరేజ్ వంటి భాగాలు ఇంకా పనిచేసే స్థితిలోనే ఉంటాయి. ఈ సామర్థ్యాన్ని వినియోగించాలని గూగుల్ భావిస్తోంది. అందుకే పాత ఫోన్ల హార్డ్‌వేర్‌ను మళ్లీ ఉపయోగించే మార్గాలపై పరిశోధనలు చేస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాండియాగో పరిశోధకులతో కలిసి గూగుల్ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతోంది. ఈ ప్రణాళిక ప్రకారం దాదాపు 2,000 పాత పిక్సెల్ ఫోన్లతో ఒక కంప్యూటింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది ఒక చిన్న డేటా సెంటర్‌లా పనిచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పాత ఫోన్‌లోని స్క్రీన్, కెమెరా, బ్యాటరీ, బాడీ వంటి అవసరం లేని భాగాలను తొలగిస్తారు. తర్వాత ప్రాసెసర్, మెమరీ, స్టోరేజ్ ఉన్న మదర్‌బోర్డును మాత్రమే ఉంచుతారు. అలాంటి వందలాది లేదా వేల మదర్‌బోర్డులను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తారు. వాటిలో లైనక్స్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి కంప్యూటింగ్ వ్యవస్థగా మార్చుతారు.
గూగుల్ అంచనా ప్రకారం 25 నుంచి 50 స్మార్ట్‌ఫోన్లతో ఏర్పడిన క్లస్టర్ కొన్ని పనుల్లో ఆధునిక సర్వర్ స్థాయి పనితీరు అందించగలదు. అలాంటి వందల ఫోన్లను కలిపితే మరింత పెద్ద స్థాయిలో సేవలు అందించే అవకాశం ఉంటుంది. దీంతో తక్కువ ఖర్చుతో కంప్యూటింగ్ వనరులు అందుబాటులోకి రావొచ్చు.
డేటా సెంటర్లు నడపడం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది. కొత్త సర్వర్ల తయారీ వల్ల కూడా పర్యావరణంపై ప్రభావం ఉంటుంది. ఇప్పటికే ఉన్న స్మార్ట్‌ఫోన్ భాగాలను మళ్లీ ఉపయోగిస్తే కొత్త హార్డ్‌వేర్ తయారీ అవసరం కొంత తగ్గుతుంది. దీంతో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు తగ్గడంతో పాటు కార్బన్ ఉద్గారాలను కూడా నియంత్రించే అవకాశం ఉంటుంది.
ఈ ప్రాజెక్టు గురించి తెలుసుకున్న వెంటనే చాలామందికి ఒక సందేహం రావొచ్చు. మరి ఇవి ఎన్వీడియా వంటి సంస్థల శక్తిమంతమైన ఏఐ చిప్‌లకు ప్రత్యామ్నాయమా? అంటే సమాధానం మాత్రం ‘కాదు’. భారీ స్థాయి కృత్రిమ మేధ సిస్టమ్‌లకు అవసరమైన శక్తిని ఇవి అందించలేవు. కానీ విద్యా సంస్థలు, పరిశోధన కేంద్రాలు, వెబ్ సేవలు, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి సెంటర్ల వంటి సాధారణ కంప్యూటింగ్ అవసరాలకు ఉపయోగపడే అవకాశం ఉంది.
కాలిఫోర్నియా యూనివర్సిటీ శాండియాగోలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల కోసం ఈ ఫోన్ క్లస్టర్‌ను వినియోగించే ప్రణాళిక ఉంది. సిస్టమ్స్ ప్రోగ్రామింగ్, ప్యారలల్ కంప్యూటింగ్ వంటి కోర్సుల్లో ఇది ఉపయోగపడనుంది. అలాగే వినియోగదారుల ఫోన్ల హార్డ్‌వేర్ డేటా సెంటర్ స్థాయి పనులను ఎంతవరకు తట్టుకోగలదో కూడా పరిశోధకులు అధ్యయనం చేయనున్నారు.