ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాంగ్మూలం నమోదు

  • తుమ్మల నివాసానికి వెళ్లి వాంగ్మూలాన్ని నమోదు చేసిన సిట్
  • తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్టు ప్రాథమిక విచారణలో గుర్తింపు
  • తుమ్మల ఫోన్ కాల్స్, లొకేషన్ డేటా వివరాలు సేకరించిన సిట్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈరోజు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లి ఆయన వాంగ్మూలాన్ని అధికారికంగా నమోదు చేసింది.

2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిట్ విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపడుతోంది. ప్రాథమిక విచారణలో అప్పట్లో ఖమ్మం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన తుమ్మల నాగేశ్వరరావు కూడా ట్యాపింగ్‌కు గురైన వారిలో ఒకరని గుర్తించినట్లు సమాచారం. కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు ఆయన ఫోన్‌ను అక్రమంగా ట్యాప్ చేయడంతో పాటు, ఆయన కదలికలను ట్రాక్ చేసి వ్యక్తిగత సంభాషణలను పర్యవేక్షించినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

మంత్రి నివాసంలో జరిగిన విచారణ సందర్భంగా ఆయన ఫోన్ కాల్స్, లొకేషన్ డేటా, వ్యక్తిగత కమ్యూనికేషన్లపై జరిగిన నిఘాకు సంబంధించి సిట్ అధికారులు పలు వివరాలు సేకరించారు. బాధితుడిగా తుమ్మల ఇచ్చిన వాంగ్మూలం కేసు దర్యాప్తులో కీలక ఆధారంగా మారే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే ఈ కేసులో గత ప్రభుత్వానికి చెందిన పలువురు సీనియర్ అధికారులు న్యాయపరమైన కస్టడీలో ఉన్నారు. తాజాగా మంత్రి తుమ్మల వాంగ్మూలం నమోదు కావడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సిట్ దర్యాప్తు వేగవంతం కావడంతో రానున్న రోజుల్లో మరికొంతమంది రాజకీయ నాయకులు, అధికారులకు నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Tummala Nageswara Rao
Telangana Phone Tapping Case
SIT Investigation Telangana
Telangana Political News
Phone Tapping Scandal
SIT Records Statement

More Telugu News